Ilayaraaja: ఇళయరాజా కేసులో ట్విస్ట్‌

పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్‌ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్‌ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

Updated : 26 Apr 2024 11:48 IST

పాటలపై రచయితలు హక్కు కోరితే ఏమవుతుందన్న హైకోర్టు  

పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్‌ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్‌ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కేసు విచారణను న్యాయమూర్తులు జూన్‌ రెండో వారానికి వాయిదా వేశారు. ఎకో, ఏఐజీ మ్యూజిక్‌ కంపెనీలు ఇళయరాజా స్వరపరిచిన 4,500 పాటలను ఉపయోగించుకునేందుకు గతంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అప్పట్లో ఈ పిటిషన్‌పై విచారించి మద్రాసు హైకోర్టు, నిర్మాతల నుంచి హక్కులను పొందిన తర్వాత ఇళయరాజా పాటలను వినియోగించుకునే హక్కు సంగీత సంస్థలకు ఉంటుందని, ఇళయరాజాకు కూడా వ్యక్తిగతంగా హక్కు ఉంటుందని 2019లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును ఇళయరాజా సవాల్‌ చేశారు. ఆ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు ఆర్‌.మహదేవన్‌, జస్టిస్‌ మహ్మద్‌ షఫీక్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఇళయరాజా పాటలను ఉపయోగించకుండా ఆ మ్యూజిక్‌ కంపెనీలపై మధ్యంతర నిషేధం విధించింది. తర్వాత మ్యూజిక్‌ కంపెనీలు అప్పీలు చేశాయి. సంగీతం అందించినందుకు ఇళయరాజాకు నిర్మాత డబ్బులు చెల్లించారని, అందుకే హక్కులు నిర్మాతకే దక్కుతాయని కంపెనీల తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. దానిపై విచారించిన ధర్మాసనం ఒక పాట రూపొందేందుకు సాహిత్యం, గాయకుడు సహా చాలామంది అవసరమని, సాహిత్యం లేనిదే పాట లేదని వ్యాఖ్యానించింది. పాటల విక్రయం ద్వారా ఇళయరాజా పొందిన మొత్తం ఎవరికి చెందుతుందనేది తుది తీర్పునకు లోబడి ఉంటుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని