
అమెరికాలో నర్సుకు తొలి కొవిడ్ టీకా
అగ్రరాజ్యంలో టీకా పంపిణీ ప్రారంభం
న్యూయార్క్: కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాలో కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభమైంది. దేశంలో ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. టీకా తొలి డోసును ఓ నర్సుకు అందించారు. దీంతో క్వీన్స్లోని లాంగ్ ఐలాండ్ యూదు మెడికల్ సెంటర్లో క్రిటికల్ కేర్లో నర్సుగా పనిచేస్తున్న సాండ్రా లిండ్సే అగ్రరాజ్యంలో తొలి టీకా పొందిన వ్యక్తిగా నిలిచారు. టీకా పొందిన సందర్భంగా ఆమె ఆనందం వ్యక్తంచేశారు. ఈ టీకాతో ఉపశమనం కలుగుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. వ్యాక్సిన్ రాకతో అమెరికా చరిత్రలో బాధాకరమైన సమయం ముగింపునకు దీన్నో నాందిగా భావిస్తున్నానన్నారు. టీకా సురక్షితమైందేనని ప్రజల్లో విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఇంకా మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు కొవిడ్ వ్యాక్సిన్ ప్రతిఒక్కరూ వేసుకొనేలా ప్రోత్సహించాలని ఆమె కోరారు. అత్యవసర వినియోగానికి ఫైజర్ టీకాకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇవ్వడంతో అధికారులు సోమవారం టీకా పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫైజర్ సీఈవో అల్బెర్ట్ బోర్లా మాట్లాడుతూ.. తానూ టీకా తీసుకుంటానని తెలిపారు. సీఈవో కూడా వ్యాక్సిన్ వేయించుకుంటే దానిపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందన్నారు.
కంగ్రాట్స్ అమెరికా: ట్రంప్ ట్వీట్
మరోవైపు, తమ దేశంలో తొలి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైనట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ అమెరికా, కంగ్రాట్స్ వరల్డ్ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. అమెరికాలో డిసెంబర్ 13 వరకు దాదాపు 16 మిలియన్ల మందికి పైగా కొవిడ్ బారిన పడగా.. 3లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.