
భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు
అధికార బదిలీ నేపథ్యంలో పెద్దపీట వేస్తున్న బైడెన్
న్యూయార్క్: అధికార మార్పిడికి ససేమిరా అంటున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత అభిప్రాయాలతో, వ్యవహార శైలితో తమకు సంబంధం లేదని.. ఆ పదవికి ఎన్నికైన జో బైడెన్ ప్రకటించారు. అధికార మార్పిడి ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. జనవరి 20న అధికారాన్ని చేపట్టడానికి అనువుగా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో బిడెన్ ప్రభుత్వ యంత్రాంగంలో తాజాగా మరో ముగ్గురు భారతీయ అమెరికన్లకు కీలక స్థానాలు దక్కాయి. అంతేకాకుండా.. వివిధ ఏజన్సీ రివ్యూ టీమ్స్ (ఏఆర్టీ) సమీక్షా బృందాల సభ్యులుగా ఇరవై మందికి పైగా భారతీయ అమెరికన్లను కాబోయే అధ్యక్షుడు నియమించినట్టు తెలిసింది. వీరిలో పలువురు ఆయా బృందాలకు సారథులుగా కూడా వ్యవహరించనున్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ (ఇంధన శాఖ) వ్యవహారాల బృందానికి అధ్యక్షుడిగా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అరుణ్ మజుందార్ ఎన్నికయ్యారు. అణ్వాయుధాల రూపకల్పన, తయారీ, పరీక్షల నిర్వహణ తదితర అంశాలు కూడా ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ రామమూర్తి రమేశ్ కూడా ఈ బృంద సభ్యునిగా ఉంటారు. రాహుల్ గుప్తా నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ బృందానికి, కిరణ్ అహూజా ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ బృందానికి సారథ్యం వహించనున్నారు.
వీరితో పాటుగా ఇరవై మందికి పైగా భారత సంతతి వ్యక్తులు వివిధ ఏఆర్టీ బృంద సభ్యులుగా నియమితులయ్యారు. వీరిలో పునీత్ తల్వార్, పావ్ సింగ్, అరుణ్ వెంకటరామన్, ప్రవీణా రాఘవన్, ఆత్మన్ త్రివేదీ, శీతల్ షా, ఆర్ రమేశ్, రామా జకారియా, శేషాద్రి రామనాథన్, రాజ్ డే, సీమా నందా, రాజ్ నాయక్, రీనా అగర్వాల్, సత్యం ఖన్నా, భావ్యా లాల్, దిల్ ప్రీత్ సిద్ధూ, దివ్యా కుమరయ్య, కుమార్ చంద్రన్, అనీశ్ చోప్రా తదితరులు ఉన్నారు. అగ్రరాజ్యంలో అధ్యక్ష అధికార మార్పిడి ప్రక్రియ సాఫీగా జరిగేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా.. బైడెన్ భారతీయ అమెరికన్లకు పెద్దపీట వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.