Published : 02/02/2020 21:15 IST

‘అమరావతి’ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి!

అమెరికాలో భారత కాన్సులేట్‌ జనరల్‌కు ప్రవాసుల విజ్ఞప్తి

అమరావతి: రాజధాని అమరావతి రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అమెరికాలో ప్రవాసాంధ్రులు భారత కాన్సులేట్‌ జనరల్‌ను కోరారు. అమరావతిలో రైతులు, మహిళలపై జరుగుతున్న దాడులను కేంద్రానికి వివరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోని ప్రవాసాంధ్రులు పలువురు ఆదివారం న్యూయార్క్‌లో భారత కాన్సులేట్‌ జనరల్‌ సందీప్‌ చక్రవర్తిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తమ వినతిని రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. ఈ సందర్భంగా రాజధానిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయనకు వివరించారు. అమరావతిని అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలను ప్రస్తుత సర్కారు పట్టించుకోవడం లేదని వివరించారు. స్థానిక మహిళలపై దాడులు జరుగుతున్నాయని, పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మొండి వైఖరితో రైతుల భవిష్యత్తు అంధకారం అవుతుందని అన్నారు.

మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఉద్యోగులు, సామాన్యులు తమ పనుల కోసం నగరాల మధ్య తిరుగుతూ డబ్బు, సమయం వృథా చేసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో అక్కడి బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఏపీ అభివృద్ధిలో వెనకబడిందని, పెట్టుబడిదారులు భయపడి వెనక్కి వెళ్తున్నారన్నారు. గత రెండు నెలలుగా రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమం ఏపీ దాటి దిల్లీకి చేరిందని వివరించారు. విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని.. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తామని కాన్సులేట్‌ జనరల్‌ సందీప్‌ హామీ ఇచ్చినట్లు ప్రవాసాంధ్రులు తెలిపారు. సమావేశంలో రాజా కసుకుర్తి, పద్మచావా, బాలసుబ్రమణ్యం నాయుడు, పవన్‌ తాత, విష్ణు కనపర్తి, నాయుడు ఈర్ల, శ్రీహరి మందాటి, రాధ, కార్తీక్‌, వంశీ కృష్ణ, రామకృష్ణ, రమేష్ తదితరులున్నారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని