Published : 07/01/2021 14:19 IST

క్యాపిటల్‌ భవనంలో ఆ 4 గంటలు..

భయంగొల్పిన వాతావరణం.. రక్షణ సొరంగంలోకి సభ్యులు

అగ్రరాజ్య చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడి జరిగింది. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ ఉభయ సభలు సమావేశమవగా.. వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ట్రంప్‌, అమెరికా జెండాలు చేతబూని క్యాపిటల్‌ భవనానికి చేరుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకునేలోపే బారికేడ్లు దాటుకొని గోడలు ఎక్కుతూ భవనంలోపలికి దూసుకొచ్చారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు తుపాకులు, బాష్పవాయువు ప్రయోగించక తప్పలేదు. దాదాపు నాలుగు గంటల పాటు నెలకొన్న హింసాత్మక వాతావరణంతో లోపలున్న ఉభయ సభల సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆత్మరక్షణ కోసం భూగర్భ సొరంగంలో దాక్కున్నారు. 

అసలేం జరిగింది..

గతేడాది నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఎలక్టోరల్‌ కాలేజీ అధికారికంగా బైడెన్‌ను తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆ ఎన్నికను ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ ఉభయ సభలు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో (అక్కడి కాలమానం ప్రకారం) సమావేశమయ్యాయి. అయితే, అప్పటికే వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనానికి చేరుకున్నారు. తొలుత బయటే నిరసనలు వ్యక్తం చేసిన ఆందోళనకారులు.. ఉన్నట్టుండి భవనంలోకి దూసుకురావడం మొదలుపెట్టారు. బారికేడ్లను దాటుకుని క్యాపిటల్‌ భవనం తూర్పు గేటు వరకు వచ్చేశారు. 

దీంతో ప్రతినిధులసభ ఛాంబర్‌లో భద్రతాసిబ్బంది.. ‘చాలా మంది ఆందోళనకారులు లోనికి వస్తున్నారు’ అంటూ సభ్యులకు హెచ్చరిక జారీ చేశారు. అటు సెనెట్‌లోనూ సభ్యులను అప్రమత్తం చేశారు. ఆ మరుక్షణమే ఎగువసభను నిర్వహిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఛాంబర్‌ నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో ప్రతినిధుల సభ, సెనెట్‌ను కలిపే రొటుండా మెట్ల దాకా ఆందోళనకారులు చేరుకున్నారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నా.. గోడలు ఎక్కుతూ లోనికి ప్రవేశించారు. దీంతో ఉభయ సభల గదులను లాక్‌ చేసి... భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. చట్టసభ్యులు ఛాంబర్లలోనే ఉండాలని, అయితే అత్యవసర పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మరోవైపు రొటుండా ప్రాంగణంలో పరిస్థితి చేజారిపోవడంతో భద్రతాసిబ్బంది బాష్పవాయువు విడుదల చేశారు.  

అయినప్పటికీ వెనక్కితగ్గని ఆందోళనకారులు రొటుండాను దాటుకుని ఛాంబర్ల లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రధాన ద్వారాల వద్ద మోహరించారు. నిరసనకారులు మరింత రెచ్చిపోయి డోర్ల అద్దాలను పగలగొట్టారు. దీంతో పోలీసులు కాల్పులు జరపకతప్పలేదు. ఈ క్రమంలో ఛాంబర్లలో ఉన్న సభ్యులు ఒకింత భయానక వాతావరణాన్ని ఎదుర్కొన్నారు. పరిస్థితి క్షణక్షణానికి ఉద్రిక్తంగా మారింది. ‘ఒక వరుసలో ఛాంబర్‌ నుంచి వెళ్లిపోండి’ అంటూ భద్రతాసిబ్బంది చట్టసభ్యులను సూచిస్తూ గట్టిగట్టిగా అరిచారు. దీంతో వారంతా పై అంతస్తుకు పరుగులు తీశారు. మరోవైపు నుంచి కిందకు దిగి భూగర్భ సొరంగం ద్వారా భవనంలోని సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు.

అటు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మహిళ తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి చనిపోయారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ ఆందోళనలు కొనసాగాయి. సాయంత్రం 6 గంటల సమయంలో క్యాపిటల్‌ భవనాన్ని కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే నిరసనకారులు మాత్రం అక్కడి నుంచి వెళ్లలేదు. క్యాపిటల్‌ భవనం పూర్తిగా సురక్షితం అని ప్రకటించిన తర్వాత రాత్రి సమయంలో కాంగ్రెస్‌ సంయుక్త సమావేశం తిరిగి ప్రారంభమైంది. బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరించే ప్రక్రియను మళ్లీ చేపట్టారు. భవనం బయట వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు నినాదాలు చేస్తున్నారు. 

భయంలోనూ పరస్పర విమర్శలు..

ఓవైపు ఆందోళనకారులు ఛాంబర్లను చుట్టుముట్టగా లోపల రిపబ్లికన్‌, డెమొక్రాటిక్ పార్టీ సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు. ‘నిరసనకారులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వస్తున్నారు. ఇదంతా మీవల్లే..మీ స్నేహితుడికి ఫోన్‌ చేయండి.. ట్రంప్‌కు ఫోన్‌ చేయండి’ అంటూ రిపబ్లికన్లపై డెమొక్రాట్లు విరుచుకుపడ్డారు. 

ఇవీ చదవండి..

‘క్యాపిటల్‌’ దాడి: ట్రంప్‌పై వేటు తప్పదా?

‘క్యాపిటల్‌’ కాల్పుల ఘటన: నలుగురి మృతి

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని