Published : 20 Jan 2021 18:44 IST

‘సంపద’ నాట్యకీర్తనం.. వాగ్గేయకారులకు ‘నీరాజనం’ 

అమెరికా: భారతీయ కళలు, సంప్రదాయాలు, మాతృభాషకు పెద్దపీట వేస్తూ రెండు దశాబ్దాలకు పైగా విలక్షణమైన కార్యక్రమాలతో ముందుకెళ్తున్న సిలికానాంధ్ర మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా SAMPADA ("Silicon Andhra Music, Performing Arts and Dance Academy") ఆధ్వర్యంలో  ‘నాట్య కీర్తనం’ అనే కొత్త కార్యక్రమం ప్రారంభించింది. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య, భక్తరామదాసు లాంటి  మరెంతో మంది వాగ్గేయకారులు మనకు అందించిన సంగీత, సాహిత్య సంపదను శాస్త్రీయ నృత్యాల ద్వారా విస్తృత ప్రాచుర్యం కల్పించి వారి గొప్పతనాన్ని భావితరాలకు అందించాలనే గొప్ప సంకల్పంతో కొన్ని ప్రత్యేక కీర్తనలను ఎంపిక చేసింది. ఆ సాహిత్యంలోని ప్రతి పదానికి , వాక్యానికి తెలుగు, ఆంగ్ల భాషల్లో అర్ధాన్ని అందించి, కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకోసం ప్రత్యేకంగా స్వరపరచి, నృత్య కళాకారులకు అందుబాటులోకి తీసుకొని రావడమే 'నాట్య కీర్తనం' లక్ష్యమని ‘సంపద’ అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు.

సంగీత, నాట్య రంగాలలో నిష్ణాతులు, విద్యావేత్తల బృందం సహకారంతో పప్పు వేణుగోపాలరావు; అన్నమయ్య కీర్తనలపై అపారమైన పరిశోధనలు చేసిన వేటూరి ఆనంద మూర్తిలాంటి పెద్దల మార్గనిర్దేశంలో, సిలికానాంధ్ర విశ్వ విద్యాలయం అధ్యాపకుల సహకారంతో తొలుత అన్నమయ్య, రామదాసు కీర్తనలను సిద్ధం చేసినట్టు ఆయన చెప్పారు. తొలి ప్రయత్నంగా డాక్టర్‌ అనుపమ కైలాష్ నాయకత్వంలో 10 అన్నమయ్య సంకీర్తనలకు, డాక్టర్‌ యశోద ఠాకూర్ నాయకత్వంలో 5 రామదాసు కీర్తనలను రికార్డు చేయడం పూర్తైనట్టు వివరించారు. వచ్చే రెండు మూడేళ్లలో కనీసం 100 కీర్తనలను సిద్ధం చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. తద్వారా నాట్య కళాకారుల్లోని సృజనాత్మకతను వెలికితీసే అవకాశం వుంటుందని దీనబాబు కొండుభట్ల అభిప్రాయపడ్డారు.

నాట్య కీర్తనం ప్రాజెక్టు ద్వారా స్వరపరచిన కీర్తనల ప్రచారంలో భాగంగా దేశంలోనే కాకుండా అమెరికా, యూకే వంటి దేశాల్లో స్థిరపడ్డ జాతీయ పురస్కార గ్రహీతలైన యువ కళాకారులతో నృత్య రీతులను సమకూర్చి జనవరి 23, 24 తేదీల్లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.  ఈ కార్యక్రమాల ప్రత్యక్షప్రసారాలను https://www.facebook.com/SiliconAndhraSAMPADA/, https://www.youtube.com/sampadatv ద్వారా అందరూ వీక్షించవచ్చని ‘సంపద’ కార్యవర్గ సభ్యులు ఫణిమాధవ్ కస్తూరి తెలిపారు. ఈ ప్రదర్శనలలో అపర్ణ ధూళిపాళ్ల (హైదరాబాద్), అవిజిత్ దాస్ (బెంగళూరు), దివ్య రవి (యూకే), కాశి ఐసోలా (అమెరికా), పాయల్ రాంచందాని (యూకే), టి. రెడ్డి లక్ష్మి(దిల్లీ), రంజిత్ & విజ్ఞ (చెన్నై), స్నేహ శశికుమార్ (కేరళ), గీతా శిరీష (బెంగళూరు), ఉమా సత్యనారాయణన్ (కేరళ) పాల్గొంటున్నారని పేర్కొన్నారు. సంధానకర్తగా డా. అనుపమ కైలాష్ వ్యవహరిస్తున్నట్టు ఆయన తెలిపారు.


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని