
జార్జ్ ఫ్లాయిడ్ హత్య: పోలీస్ అధికారే దోషి
వాషింగ్టన్: అమెరికాను కుదిపేసిన ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్(46) మృతి కేసులో అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఫ్లాయిడ్ మృతికి మినియాపొలిస్ మాజీ పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ కారణమని.. ఆయన్ను దోషిగా పేర్కొంటూ కోర్టు తీర్పు చెప్పింది. 12 మంది సభ్యులున్న జ్యూరీ 10 గంటలపాటు విచారించి ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా చేయని సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్‌గా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది. శిక్షను తరువాత ప్రకటించనున్నారు.
విచారణ సందర్భంగా కోర్టు ప్రాంగణం ఎదుట భారీగా ప్రజలు గుమిగూడారు. తీర్పు వెలువడిన అనంతరం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తీర్పు చెప్పే సమయంలో మాస్క్‌తో ఉన్న డెరెక్ ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించలేదు. మరోవైపు కోర్టు వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీఎత్తున బలగాలు మోహరించాయి. జార్జ్ హత్య జరిగిన సమయంలో డెరిక్‌తో పాటు ఉన్న మరో ముగ్గురు పోలీసులపైనా అభియోగాలు నమోదయ్యాయి. వారి విచారణ ఆగస్టు నుంచి జరగనుంది. తీర్పు వెలువడిన అనంతరం జార్జ్ కుటుంబ సభ్యులతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫోన్లో మాట్లాడారు. అమెరికాలో న్యాయం జరిగిన రోజుగా కమలా హారిస్ అభివర్ణించారు.
2020 మే 25న దుకాణంలో నకిలీ నోట్లు సరఫరా చేశారన్న ఆరోపణలతో జార్జ్ ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్ పట్టుకుని రోడ్డుపై పడుకోబెట్టి మెడపై మోకాలితో తొక్కిపెట్టాడు. ఈ క్రమంలో జార్జ్ తనకు ఊపిరి ఆడడం లేదంటూ ఎంత మొత్తుకున్నా ఆ కర్కశ పోలీసు కనికరించలేదు. ఫలితంగా జార్జ్ అక్కడికక్కడే మరణించాడు. దీంతో అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. నిరసనకారుల ఆందోళనలతో ఒకానొక సమయంలో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ కొద్దిసేపు రహస్య బంకర్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్లజాతీయులపై దాడికి నిరసనగా వేలకొద్దీ ప్రజలు రోడ్లమీదకి రావడంతో పలు రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి. ఆ సమయంలో ప్రపంచమంతా జార్జ్‌కు మద్దతుగా నిలిచింది.