తెలంగాణలో ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలి

అఖిలపక్షం ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైకోర్టు సైతం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా చలనం లేదని విమర్శించారు...

Published : 14 Aug 2020 14:25 IST

హైదరాబాద్‌: అఖిలపక్షం ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైకోర్టు సైతం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా చలనం లేదని విమర్శించారు. అఖిలపక్షం ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తమ ఉద్యమ కార్యాచరణను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 

శుక్రవారం నాంపల్లిలోని తెజస కార్యాలయంలో అఖిపక్షం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోదండరాం, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, జాలకంటి రాంగారెడ్డి, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ...‘‘హైకోర్టు చెప్పిన మేరకు రాష్ట్రంలో విస్తృతంగా ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలి. ఆరు నెలల పాటు ప్రతి కుటుంబానికి రూ.7,500తోపాటు ఉచిత రేషన్‌ ఇవ్వాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ ఉపాధిహామీ పథకం ప్రవేశ పెట్టి ఉపాధి కల్పించాలి. తొలగించిన కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకుని పనికి సమాన వేతనం ఇవ్వాలి’’ అని ప్రభుత్వాన్ని కోదండరాం డిమాండ్‌ చేశారు. 

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ... రాజ్యాంగం కల్పించిన ఆహార భద్రత, జీవించే హక్కులను కేసీఆర్‌ విస్మరిస్తున్నారన్నారు. అసెంబ్లీ వేదికగా కరోనాపై కేసీఆర్‌ హేళనగా మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆరోగ్య సమస్యలేమైనా వచ్చాయా? సమావేశాలు నిర్వహించే స్థితిలో లేరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పేద ప్రజలను ఆదుకునే వరకు అఖిలపక్షం పోరాడుతుందని రమణ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగంలో అఖిలపక్షం డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆగష్టు 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 

దేశంలో ఇప్పటికీ మెరుగైన వైద్యం అందడం లేదని చాడ వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ సచివాలయం కూల్చివేత, హరితహారంపై దృష్టి పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడి, ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని