మనం ‘బనానా రిపబ్లిక్’‌లో లేము..!

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మంబయి గురించి చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ సమర్థించబోదని, ఆమె తప్పుగా మాట్లాడారని మహారాష్ట్ర మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌.............

Published : 08 Sep 2020 01:06 IST

దేవేంద్ర ఫడణవీస్‌ వ్యాఖ్య

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మంబయి గురించి చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ సమర్థించబోదని, ఆమె తప్పుగా మాట్లాడారని మహారాష్ట్ర మాజీ సీఎం, భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. కానీ ఆమెకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరైన ఆయన విధాన సభ బయట మీడియాతో మాట్లాడారు. ప్రతిఒక్కరి ప్రాణాలకీ రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. ముంబయిని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలను తాము మాత్రమే కాదు.. ఎవరూ సమర్థించబోరన్నారు. కానీ ఆమెకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పిన ఫడణవీస్‌.. మనమేమీ ‘బనానా రిపబ్లిక్‌’లో బతకడంలేదు కదా అని వ్యాఖ్యానించారు. న్యాయబద్ధమైన దేశంలో ఉగ్రవాదులపైనే ఎవరూ దాడికి పాల్పడకుండా వారికి ప్రాణాలకు భద్రత కల్పిస్తున్నామని.. అలాంటిది ఆమె ఇప్పటికీ ఓ కళాకారిణిగా ఉన్నారన్నారు. మరోవైపు, కంగనా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణం కావడంతో ఆమెకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వై కేటగిరీ భద్రతను కల్పించిన విషయం తెలిసిందే.

(బనానా రిపబ్లిక్‌ అంటే రాజకీయంగా అస్తవ్యస్థంగా ఉండటంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలను బనానా రిపబ్లిక్‌ అని వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఒక దేశం ఒకే వస్తువులను ఎగుమతులు చేస్తూ దానిపైనే ఆధారపడివుండటాన్ని కూడా బనానా రిపబ్లిక్‌గా పేర్కొంటారు. ఈ పదాన్ని ప్రముఖ అమెరికన్‌ రచయిత ఒ. హెన్రీ తన  పుస్తకం ‘క్యాబేజ్‌స్‌ అండ్‌ కింగ్స్‌’లో తొలిసారిగా వాడారు.  అప్పట్లో మధ్య అమెరికాలోని హోండూరస్‌ దేశం అమెరికా కంపెనీ చేతిలో దోపిడికీ గురయ్యేది.ఎక్కువగా అరటిపండ్ల ఎగుమతులపై ఆధారపడివుండేది.  అమెరికా విధానాలను  విమర్శిస్తూ ఆయన హోండూరస్‌ను బనానా రిపబ్లిక్‌గా పిలిచారు.  ఇప్పటికీ ఏదైనా దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడి ఒక ఏకీకృతమైన విధానం లేక పోతే బనానా రిపబ్లిక్‌గా విమర్శిస్తుంటారు.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని