‘ షెకావత్‌ వెంటనే రాజీనామా చేయాలి’

కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి అజయ్‌ మాకెన్‌ డిమాండ్‌ చేశారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు...........

Published : 19 Jul 2020 15:45 IST

రాజస్థాన్‌ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ డిమాండ్‌

జైపుర్‌: కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అజయ్‌ మాకన్‌ డిమాండ్‌ చేశారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఆయన ప్రయత్నించారని ఆరోపించారు. ఆడియో టేపుల్లో ఉన్నది ఆయన గొంతే అని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎలాంటి కుట్రలు చేయనట్లైతే పోలీసుల విచారణకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. హరియాణాలో ఉన్న కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వర్గీయులు వాయిస్ శాంపిల్స్ ఇవ్వకుండా ఎందుకు పారిపోయారని నిలదీశారు. 

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలన్న భాజపా డిమాండ్‌ను ఆయన తప్పుబట్టారు. సీబీఐ ద్వారా బెదిరింపులకు గురిచేయాలనుకుంటున్న భాజపా కుయుక్తులకు తలొగ్గేదే లేదని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేసిన కుట్రలో భాజపాకు చెందిన అగ్రనాయకులు ఉన్నారని.. అందుకే సీబీఐ వంటి విచారణ సంస్థలచే భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రతో భాజపాకు ఎలాంటి సంబంధం లేకపోతే.. కేంద్ర ప్రభుత్వం, హరియాణా ప్రభుత్వం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపు పన్నుశాఖ.. ఇలా ప్రతిఒక్కరూ సచిన్‌ పైలట్‌ వర్గాన్ని రక్షించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీ డబ్బు ఇవ్వజూపేందుకు ప్రయత్నించినట్లు ఆడియో టేపుల ద్వారా తెలుస్తోందని.. అంత నల్లధనం భాజపాకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు భాజపా అవలంబిస్తున్న విధానాల్ని చూస్తున్న ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోతుందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి..

రాజస్థాన్‌ ఫోన్‌ట్యాపింగ్‌: వివరణ కోరిన కేంద్ర హోంశాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని