
‘పాక్ అంగీకరించింది.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి’
పుల్వామాపై పాక్ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో భాజపా డిమాండ్
దిల్లీ: పుల్వామా దాడిలో తమ ప్రమేయం ఉందని పాక్ సీనియర్ మంత్రి స్వయంగా అంగీకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై భాజపా విరుచుకుపడింది. దాడి వెనుక తమ హస్తం ఉందని స్వయంగా పాకిస్థానే అంగీకరించినందున కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్ష పార్టీలు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ డిమాండ్ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన దాడిలో అధికార పార్టీ కుట్ర ఉందంటూ ఆరోపించిన వారు వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
పుల్వామా దాడి వెనుక ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత బీకే.హరప్రసాద్ గతంలో ఆరోపించారు. అలాగే జవాన్లపై జరిగిన దాడితో భాజపా లాభపడిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పలు ప్రశ్నలు సంధించారు. ఈ దాడిలో అధికార పార్టీ కుట్ర ఉందంటూ అప్పట్లో పలువురు విపక్ష నేతలు నిరాధార ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జావడేకర్ వారంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ఏడాది జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి దుశ్చర్యలో తమ ప్రమేయం ఉందని పాక్ సీనియర్ మంత్రి ఫవాద్ చౌధురి ఆ దేశ పార్లమెంటులోనే అంగీకరించారు. పుల్వామా దాడి.. ఇమ్రాన్ నాయకత్వంలో పాక్ సాధించిన ఘన విజయంగా అభివర్ణించారు. ఫవాద్.. ప్రధాని ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహితుడు. అభినందన్ విడుదలకు ముందు పాక్ అగ్ర నాయకత్వం కాళ్లు వణికాయన్న విపక్ష నేత సాదిఖ్ వ్యాఖ్యలకు బదులిస్తూ ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.