నా వద్ద 121 భాజపా సభ్యుల చిట్టా ఉంది: రౌత్‌

విశ్వసనీయ దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలకు వాటి ప్రాముఖ్యత తగ్గుతోందని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ ఆరోపించారు. పంజాబ్‌-మహారాష్ట్ర బ్యాంకు(పీఎంసీ)బ్యాంకు కుంభకోణం కేసులో తన భార్య వర్షకు ..

Updated : 21 Dec 2022 15:22 IST

ముంబయి: విశ్వసనీయ దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలకు వాటి ప్రాముఖ్యత తగ్గుతోందని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ ఆరోపించారు. పంజాబ్‌-మహారాష్ట్ర బ్యాంకు(పీఎంసీ) కుంభకోణం కేసులో తన భార్య వర్షకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా సమావేశంలో దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేశారు. తనతో ఎవరైనా రాజకీయంగా తలపడాలనుకుంటే ఎదురుగా వచ్చి ఢీకొట్టాలని భాజపాకు పరోక్షంగా సవాల్‌ విసిరారు. 

‘ఈడీ సమన్లు జారీ చేసిన విషయమై నేను ఇప్పటికే సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చించా. దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. శివసేన తగిన రీతిలో వారికి జవాబు ఇస్తుంది. విశ్వసనీయ దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలకు ప్రాముఖ్యత తగ్గుతోంది. గతంలో ఈ ఏజెన్సీలు ఏదైనా చర్యలు తీసుకుంటే అందులో ఆ అంశం ఎంతో తీవ్రమైనదిగా ఉండేది. కానీ, గత కొద్ది సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీ తన కోపాన్ని ప్రదర్శించినపుడే.. ఈ ఏజెన్సీలు చర్యలు తీసుకుంటున్నాయి. నా వద్ద భాజపాకు చెందిన 121 మంది సభ్యుల ఫైల్స్‌ ఉన్నాయి. వాటిని త్వరలోనే ఈడీకి సమర్పిస్తాను. ఈడీ ఇంకా ఐదేళ్ల పాటు పనిచేయడానికి సరిపడా మంది పేర్లు ఉన్నాయి’ అని రౌత్‌ తీవ్రంగా మండిపడ్డారు.

పీఎంసీ బ్యాంకు స్కాం కేసులో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ భార్య వర్షకు సంబంధాలున్నాయంటూ ఈడీ ఆదివారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. పీఎంసీ బ్యాంకు స్కామ్‌ కేసులో నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌ రౌత్‌కు వర్షకు మధ్య లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఆరోపించింది. దీంతో ఈ కేసు విచారణలో భాగంగా ఆమె డిసెంబర్‌ 29న ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. కాగా ఈడీ ఈ నెలలో ఆమెకు సమన్లు జారీ చేయడం ఇది మూడో సారి కావడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని