పోలింగ్‌కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు

ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

Published : 10 May 2024 06:29 IST

తద్వారా ఓటర్లను ప్రలోభపెట్టాలని వైకాపా కుతంత్రం  
రూ.14 వేల కోట్ల నిధులను వివిధ ప్రభుత్వ ఖాతాల్లో దాచారు  
తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజం  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. జనవరి 23 నుంచి మార్చిలో ఎన్నికల కోడ్‌ వచ్చేదాకా నొక్కిన బటన్‌ల సొమ్మును ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. అంటే ఇవన్నీ ఉత్తుత్తి బటన్‌లేనా? అని నిలదీశారు. వాటికి సంబంధించిన రూ.14 వేల కోట్ల సొమ్మును వివిధ ప్రభుత్వ శాఖల ఖాతాల్లో ఎందుకు దాచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి భాగస్వామిగా ఉన్నారని విమర్శించారు. నిధుల జమకు ఈసీ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వెళ్లడంతో ఈ వ్యవహారం బయటపడిందన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జనవరి 23 నుంచి ఆసరా, వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీతోఫా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాలకు సంబంధించిన బటన్‌లను సీఎం జగన్‌ నొక్కారు. నగదు బదిలీ అయినట్టు లబ్ధిదారులకు భ్రమ కలిగించారు. వాస్తవానికి జమ చేయకుండా పెండింగ్‌ పెట్టారు. నిధుల్ని ఆయా శాఖల ఖాతాల్లోనే ఉంచారు. ఎన్నికలకు ముందు తాయిలాలుగా వాడుకోవాలనే ఈ కుట్ర చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకం కాదా?

‘ఆయా పథకాల కింద ఖర్చు చూపించాక లబ్ధిదారులకు నగదు బదిలీ చేయకపోవడం ఎంతవరకు సమంజసం? నిధుల్ని ప్రభుత్వ ఖాతాల్లో ఉంచడం బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకం కాదా? సీఎస్‌కు తెలియకుండా ఈ వ్యవహారం జరుగుతుందా? వైకాపాకు కొమ్ముకాసేలా తీసుకున్న ఈ నిర్ణయం ముమ్మాటికీ నేరపూరితమే?’ అని విజయ్‌కుమార్‌ మండిపడ్డారు. మార్చి నెలలో రూ.13 వేల కోట్లు అడ్డగోలుగా వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టినప్పుడు ప్రజలు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. సీఎస్‌తోపాటు ఆయా శాఖల అధిపతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని