అది పార్టీ నిర్ణయం..ఈసీకి సంబంధం లేదు..

తనను ఎన్నికల సంఘం (ఈసీ) స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా నుంచి తొలగించడంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Published : 31 Oct 2020 18:11 IST

సుప్రీంను ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి

దిల్లీ: తనను ఎన్నికల సంఘం (ఈసీ) స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా నుంచి తొలగించడంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ రాష్ట్రంలో వచ్చే వారంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తున్నారని, తమ హెచ్చరికలను సైతం విస్మరిస్తున్నారని మండిపడిన ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. స్టార్‌ క్యాంపెయినర్‌గా ఆయన్ను అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఇకపై కమల్ నాథ్ ఏ నియోజకవర్గంలోనైనా ప్రచారానికి వెళ్తే..ఆయనకు సంబంధించిన ఖర్చులన్నీ అక్కడి అభ్యర్థులే భరించాలని స్పష్టం చేసింది.  

కాగా, ఈసీ నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయించిన కమల్‌ నాథ్‌..‘ఒక వ్యక్తిని స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించడం పార్టీ హక్కు. పార్టీ నిర్ణయాల్లో ఈసీ జోక్యం చేసుకోలేదు. ఇది ప్రాథమిక హక్కు అయిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడం కిందికే వస్తుంది’ అని కోర్టుకు వెల్లడించారు. అలాగే తన తొలగింపునకు సంబంధించి ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. 

ఇటీవల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భాజపా మహిళా అభ్యర్థిని అభ్యంతరకర పదజాలంతో దూషించడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఈసీ ఆయన్ను హెచ్చరించింది. కాగా, ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబావుటా ఎగరవేయడంతో కమల్‌ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. అసమ్మతి ఎమ్మెల్యేలు అంతా సింథియాతో కలిసి భాజపాలో చేరారు. అనంతరం వారు తమ శాసనసభ స్థానాలకు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని