అది సవాలే.. కానీ గెలుపు మాదే: కుమార

కర్ణాటకలోని రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 3న జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాలను అధిగమించడం తమకు సవాలేనని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఈ రెండు స్థానాల్లో తమ.........

Published : 01 Oct 2020 01:12 IST

బెంగళూరు: కర్ణాటకలోని రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 3న జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాలను అధిగమించడం తమకు సవాలేనని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఈ రెండు స్థానాల్లో తమ పార్టీయే గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మాది ప్రాంతీయ పార్టీనే..  అయినప్పటికీ దేశానికి ఓ ప్రధానిని ఇచ్చింది. మా బలం కర్ణాటకలోనే ఉంది. ఈ ఉప ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కోవడం మాకు సవాలే. ఆ  పార్టీలను ఓడించేందుకు తెలివిగా వ్యూహరచన చేయాలి. మానసికంగానూ సన్నద్ధమవుతున్నాం’’ అని తెలిపారు. ఈ రెండు స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని కుమారస్వామి వెల్లడించారు. 

కర్ణాటకలోని సిరా, రాజరాజేశ్వరి నగర్‌ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. సిరా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బి. సత్యనారాయణ గత నెలలో మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే, రాజరాజేశ్వరినగర్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ముణిరత్న గతేడాది పార్టీ ఫిరాయించడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఖాళీ అయిన రెండు స్థానాల్లో ఉప ఎన్నికకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. సిరా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఇప్పటికే తమ అభ్యర్థిగా మాజీ మంత్రి టీబీ జయచంద్రను బరిలో దించింది. జేడీఎస్‌ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే, మృతి చెందిన ఎమ్మెల్యే సత్యనారాయణ కుటుంబ సభ్యులనే నిలబెట్టి సానుభూతి ఓట్లు రాబట్టుకొనేందుకు యోచిస్తోందని ప్రచారం జరుగుతుంది. అధికార భాజపా కూడా సిరాలో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. రాజరాజేశ్వరి నగర్‌ ఉప ఎన్నికకు మూడు పార్టీలూ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని