Karnataka Polls: ఆమ్‌ఆద్మీ దూకుడు.. రాహుల్‌ గాంధీ వరాలు..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly) పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేయనున్నట్లు పేర్కొన్న ఆప్‌.. ప్రస్తుతం 80 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు ప్రకటించామని తెలిపింది.

Published : 20 Mar 2023 19:32 IST

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly) సమయం దగ్గరపడుతోన్న వేళ.. రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఇందులో భాగంగా మరో ముందడుగు వేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP).. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 80 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో (224)నూ ఆప్‌ పోటీ చేస్తుందని స్పష్టం చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే నెలలో జరగనున్న విషయం తెలిసిందే.

ఆమ్‌ఆద్మీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో న్యాయవాది బ్రిజేష్‌ కలప్పను చిక్‌పేట్‌ అసెంబ్లీ స్థానం నుంచి రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించింది. బెంగళూరు మహానగరపాలక సంస్థ (బీబీఎంపీ) మాజీ అధికారి కే మథాయ్‌, బీ నాగప్ప, మోహన్‌ దాసరి, శాంతాల దామ్లే, అజయ్‌ గౌడ వంటి నేతల పేర్లను ఈ మొదటి జాబితాలో ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన వారు ఈ జాబితాలో ఉన్నరని.. వీరి సరాసరి వయసు 46సం.లు మాత్రమేనని కర్ణాటక ఆప్‌ అధ్యక్షుడు పృథ్వీ రెడ్డి వెల్లడించారు. వీరందరూ ఉన్నత విద్యావంతులేనని.. పార్టీ నిర్వహించిన సర్వే ప్రకారమే వీరిని ఎంపిక చేసినట్లు తెలిపారు.

నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు..

ఎన్నికలకు గడవు సమీపిస్తోన్న వేళ ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తప్పక విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యువతకు వరాలు గుప్పించిన రాహుల్..  ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేయడంతోపాటు యువతకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే మూడు హామీలను ప్రకటించామన్నారు. గృహజ్యోతి పేరుతో 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు నెలకు రూ.2వేలు, బీపీఎల్‌ కుటుంబాలకు 10కిలోల ఉచిత బియ్యం అందిస్తామన్నారు. ఇక నాలుగో హామీగా డిగ్రీ పూర్తి చేసిన వారికి రూ.3వేలు, డిప్లొమా ఉన్నవారికి రూ.1500 ఆర్థిక సహాయం అందిస్తామని రాహుల్‌ గాంధీ వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి మయమైందన్న ఆయన.. లంచం తీసుకుంటూ భాజపా ఎమ్మెల్యే విరూపక్షప్ప కుమారుడు చిక్కినప్పటికీ ప్రభుత్వం మాత్రం వారిని రక్షిస్తోందని దుయ్యబట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు