Kejriwal: ‘ఆ 14 స్థానాల్లో మేమే’: ‘ఇండియా’ కూటమికి మరో షాకిచ్చిన కేజ్రీవాల్‌

పంజాబ్‌ లోక్‌సభ స్థానాల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని కేజ్రీవాల్‌(Arvind Kejriwal) వెల్లడించారు.

Published : 10 Feb 2024 16:44 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముంగిట విపక్ష ‘ఇండియా’ కూటమికి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆప్‌(AAP) మరో షాకిచ్చింది. పంజాబ్‌(Punjab)లో కూటమితో ఎలాంటి పొత్తు ఉండదని పార్టీ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) వెల్లడించారు. చండీగఢ్‌తో సహా మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టంచేశారు. ‘15 రోజుల్లోగా ఈ స్థానాల్లో ఆప్‌ అభ్యర్థులను ప్రకటిస్తుంది’ అని తెలిపారు.

సీట్ల సర్దుబాటుపై సందిగ్ధం వీడకపోవడంతో పంజాబ్‌ విషయంలో ఇదివరకే ఆప్‌ ఈతరహా ప్రకటన చేసింది. తాజాగా దీనిపై కేజ్రీవాల్‌ స్పష్టత ఇచ్చారు. మరోవైపు అస్సాంలో మొత్తం 14 లోక్‌సభ నియోజకవర్గాలకు గానూ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దిబ్రుగఢ్‌ నుంచి మనోజ్‌ దానోవర్‌, గువాహటి, తేజ్‌పుర్‌ స్థానాల నుంచి భాబెన్‌ చౌదరి, రిషిరాజ్‌ కౌంటిన్యలు పోటీ చేస్తారని వెల్లడించింది.        ఈ మూడూ కాంగ్రెస్‌కు మంచి పట్టున్న స్థానాలే కావడం గమనార్హం.

ఆర్‌ఎల్‌డీ అడుగులు ఎన్డీయే వైపు!

సీట్ల పంపకాలను వీలైనంత తొందరగా తేల్చాలని ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని పలుమార్లు కోరామని, ఎంతకూ స్పందన రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటించామని ఆప్‌ జాతీయ కార్యదర్శి సందీప్‌ పాఠక్‌ మీడియాకు వెల్లడించారు. భాజపాని ఓడించాలంటే పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని, అభ్యర్థులను ఖరారు చేస్తే.. వాళ్లు ప్రజల్లోకి వెళ్లే వీలుంటుందని చెప్పారు. ఈ విషయం కాంగ్రెస్‌ నేతలకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని