Yogi Adityanath: మోదీ వల్లే అదంతా సాధ్యమైంది: యోగి

ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా శాసనసభాపక్ష నేతగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం లఖ్‌నవూలోని లోక్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి .....

Published : 25 Mar 2022 01:12 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా శాసనసభాపక్ష నేతగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం లఖ్‌నవూలోని లోక్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో భాజపా శాసనసభాపక్షం సమావేశమైంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి యోగి మాట్లాడుతూ.. 2017కు ముందు తనకు ఎలాంటి పరిపాలనా అనుభవం లేదనీ.. యూపీలో సుపరిపాలనకు ప్రధాని నరేంద్ర మోదీయే తనకు మార్గనిర్దేశం చేశారన్నారు. యూపీలో ఇప్పుడు పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. యూపీలో ఒక పార్టీ వరుసగా రెండోసారి భారీ మెజార్టీతో గెలిచి ఒక ముఖ్యమంత్రి మళ్లీ ఎన్నిక కావడం ఇదే తొలిసారన్నారు. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ మార్గనిర్దేశం, విజయవంతమైన నాయకత్వం వల్లే సాధ్యమైందని చెప్పారు. 

‘‘2017లో పార్టీ నాపై విశ్వాసం ఉంచింది. అప్పుడు నేను ఎంపీగా ఉన్నా. యూపీలో 2017కు ముందు ఎవరూ సుపరిపాలన గురించి మాట్లాడేవారు కాదు. ఇప్పుడది సాధ్యమైంది. ఎలాంటి వివక్షా లేకుండా సామాన్యులకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చాం. గతంలో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ ప్రభుత్వాల హయాంలో ఇలాంటి ఆలోచనే అసలు ఉండేది కాదు. ఇప్పుడు మన బాధ్యత మరింతగా పెరిగింది. సుపరిపాలనను ఇంకా మందుకు తీసుకెళ్లేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలి’’ అని యోగి అన్నారు.

మనమంతా గర్వపడాల్సిన సందర్భం! 

మరోవైపు, భాజపా శాసనసభాపక్ష సమావేశంలో కేంద్రమంత్రి అమిత్‌షా యోగిని ప్రశంసల్లో ముంచెత్తారు. గత 37ఏళ్లలో యూపీలో ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదన్నారు. ‘‘మనందరికీ ఇది గర్వించదగిన విషయం. ఒక ముఖ్యమంత్రి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం రావడం యూపీలో ఇదే ప్రథమం. సాధారణ ఎన్నికలు మొదలైనప్పట్నుంచి ఎప్పుడూ యూపీలో ఇలా జరగలేదు. ఒక ముఖ్యమంత్రి మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్‌ రావడం మనందరికీ గర్వకారణం. సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఇలా జరగలేదు. యూపీలో చాలా కాలం రాజకీయ అస్థిరతే కొనసాగుతూ వచ్చింది. ఫలితంగా ఫలితంగా కుల, కుటుంబ పార్టీలు పెరిగేందుకు దారితీసింది. సమాజ్‌వాదీ పార్టీ హయాంలో నేర రాజకీయాలు సాగాయి. దీన్నుంచి ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారు. 2017 తర్వాత ఇక్కడి ప్రజలకు విముక్తి లభించింది. అప్పట్లో పారిశ్రామికవేత్తల కాన్ఫెరెన్స్‌లు కూడా దిల్లీలోనే జరిగేవి. లఖ్‌నవూ వచ్చేందుకు ఎవరూ సాహసించేవారు కాదు. ఎస్పీ హయాంలో గూండాలు, మాఫియాదే రాజ్యం. పేదలు ఎవరిపైనా ఫిర్యాదు చేయాలంటేనే భయపడేవారు. 2017తర్వాత అధికారంలో మార్పు వచ్చాక.. గూండాలు, మాఫియా పరిస్థితి ఏంటో మీరే చూస్తున్నారు కదా. మనందరికీ మోదీలాంటి దూరదృష్టికలిగిన నేత, కష్టపడి పనిచేసే నాయకత్వం ఉంది. పేదలకు అంకితమై పనిచేసే నాయకత్వం దొరికింది. మోదీ సారథ్యంలో యోగి పేదల సంక్షేమానికి సంబంధించిన ప్రతి పనిని పూర్తిచేశారు’’ అన్నారు.  

యోగి ఆదిత్యనాథ్‌ ఈరోజు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ను కలవనున్నారు. యూపీలో తిరిగి రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. శుక్రవారం యూపీ ముఖ్యమంత్రిగా యోగి వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు భాజపా అగ్రనేతలు హాజరు కానున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని