
Mamata Banerjee: భాజపాను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలి: దీదీ
కోల్కతా: భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. భాజపాను, విభజన అజెండాను ఓడించేందుకు అందరం కలిసి పోరాడాలన్నారు. ఈనెల 28నుంచి రెండు రోజులపాటు గోవా పర్యటనకు సిద్ధమైన దీదీ.. బెంగాల్ ఎన్నికల్లో సాధించిన ఉత్సాహంతో భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఓ ట్వీట్ చేశారు. ‘ఈనెల 28వ తేదీన గోవాలో నా తొలి పర్యటనకు సిద్ధమయ్యా. భాజపాను, వారి విభజన ఎజెండాను ఓడించేందుకు ప్రజలు, సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిస్తున్నా. గత పదేళ్లుగా గోవా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.
వచ్చే ఏడాది జరిగే గోవా శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేయనున్నట్లు మమతా బెనర్జీ గతంలోనే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ గోవాలో టీఎంసీ భారీ స్థాయిలో అడుగుపెడుతుందని ఆ పార్టీ ఎంపీ, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సైతం గతంలోనే వెల్లడించారు. అప్పటినుంచి పలువురు నేతలను టీఎంసీ తమ పార్టీలో చేర్చుకుంటోంది. గోవా మాజీ ముఖ్యమంత్రి లుజినో ఫలైరోతో సహా కొంతమంది కాంగ్రెస్ నేతలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. స్వతంత్ర్య ఎమ్మెల్యే ప్రసాద్ గోవాంకర్ మద్దతు ప్రకటించారు.
గోవాలో అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఆశిస్తోంది. కొద్దిరోజుల క్రితం గోవా రాజధాని పనాజీలో పర్యటించిన ఆప్ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గోవా ప్రజలపై హామీల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తామని, 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చస్తామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.