Maharashtra: సీఎం పదవి దక్కదని అజిత్‌కు తెలుసు: ఫడణవీస్‌

త్వరలో మహారాష్ట్ర కొత్త సీఎంగా అజిత్‌ పవార్‌ నియమితులవుతారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చవాన్‌ వ్యాఖ్యానించారు. అయితే, భాజపా నేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు.

Published : 25 Jul 2023 01:49 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)కు త్వరలో కొత్త ముఖ్యమంత్రి వస్తారనే ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చవాన్‌ (Prithviraj Chavan) సైతం తాజాగా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 10.. ఆ సమయంలో ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) స్థానంలో ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ (Ajit Pawar)ను సీఎంగా చేస్తారని ఆయన జోస్యం చెప్పారు. శిందే సహా ఆయన వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై ఆలోపు నిర్ణయం వస్తుందని తెలిపారు. అయితే, భాజపా నేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఈ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.

‘శిందేకు తన సొంత జిల్లా ఠాణె మినహా రాష్ట్రంలోని మిగతా చోట్ల ఎలాంటి బలం లేదు. ఈ నేపథ్యంలో ఆయన నేతృత్వంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భాజపా ఆసక్తిగా లేదు. అజిత్ పవార్‌ రూపంలో ఇప్పుడు భాజపాకు ప్రత్యామ్నాయం దొరికింది. ఎన్నికల్లో శిందేకన్నా అజిత్‌ ఎక్కువ ప్రభావం చూపగలరు. దీంతో ఆయన్ను ముఖ్యమంత్రి చేసి ఎన్నికలకు వెళ్లాలని భాజపా అగ్ర నాయకత్వం భావిస్తోంది. సీఎం పదవి కోల్పోవడమే శిందే భవితవ్యం’ అని చవాన్‌ ఓ వార్తాసంస్థతో అన్నారు.

శిందేకు పొగ?.. త్వరలో ముఖ్యమంత్రిగా అజిత్‌!

మరోవైపు.. చవాన్‌ వ్యాఖ్యలను దేవేంద్ర ఫడణవీస్‌ తోసిపుచ్చారు. మహారాష్ట్రకు ఏక్‌నాథ్ శిందేనే సీఎం అని, ఆ పదవిలో ఆయనే కొనసాగుతారని స్పష్టం చేశారు. ‘భాజపా, ఎన్సీపీ, శివసేన (శిందే వర్గం)లో దీనిపై స్పష్టమైన అవగాహన ఉంది. అజిత్‌కు కూడా ఈ విషయం తెలుసు. జులై 2న జరిగిన సమావేశానికి ముందే ఇదంతా వివరించాం. ముఖ్యమంత్రి విషయంలో ఎలాంటి మార్పు ఉండదు’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అజిత్‌తోపాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. ఈ క్రమంలోనే సీఎం మార్పు ఊహాగానాలు జోరందుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని