LokSabha Polls: కాంగ్రెస్‌తో చర్చల వేళ.. తొలిజాబితా ప్రకటించిన అఖిలేశ్‌

కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతోన్న సమయంలోనే 16 లోక్‌సభ స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

Published : 30 Jan 2024 21:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్రంలో భాజపాను ఎదుర్కొనేందుకు ఏర్పడిన విపక్షాల కూటమి ‘ఇండియా’లో (INDIA) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్‌ జాప్యం చేస్తోందని ఆరోపిస్తున్న మిత్రపక్షాలు.. సొంత నిర్ణయాలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) కూడా మరో అడుగు ముందుకు వేసింది. కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతోన్న సమయంలోనే 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) విపక్ష పార్టీలు కలిసి పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటికి సంబంధించి చర్చలు జరుపుతున్నాయి. అయితే అనూహ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. అఖిలేశ్‌ (Akhilesh Yadav) భార్య డింపుల్‌ యాదవ్‌కు మైన్‌పురి స్థానాన్ని ఖరారు చేసింది. అయినప్పటికీ, కూటమిలో మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు 11 సీట్లు పక్కన పెట్టినట్లు తెలిపింది.

30 గంటల పాటు సీఎం ‘మిస్సింగ్‌’.. నాడు తండ్రి శిబు కూడా..!

ఈ విషయంపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ స్పందించారు. పార్టీ ఏదీ ఉత్తమమైందని భావిస్తుందో అదే చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఎటువంటి క్లియరెన్స్‌ అవసరం లేదన్నారు. ఇదిలాఉంటే, కూటమి నుంచి బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ బయటకు వెళ్లిపోవడం, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌లలో కాంగ్రెస్‌తో కాకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్‌, ఆప్‌లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని