Bharat Jodo Yatra: మహబూబ్‌నగర్‌లో జోడో యాత్ర.. గిరిజనులతో కలిసి రాహుల్‌ నృత్యం..

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర శనివారం ఉదయం మహబూబ్‌ నగర్‌ మండల పరిధిలో ప్రారంభమైంది. సినీనటి పూనమ్‌కౌర్‌ రాహుల్‌తో పాదయాత్రలో పాల్గొన్నారు. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో రాహుల్‌ సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు.

Updated : 29 Oct 2022 11:35 IST

పాలమూరు: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర శనివారం ఉదయం 6 గంటలకు మహబూబ్‌ నగర్‌ మండల పరిధిలోని ధర్మాపూర్‌లో ఉన్న జయప్రకాశ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌, ఏఐసీసీ సభ్యుడు జైరాం రమేష్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్‌, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే సీతక్క, సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉదయం సమయంలో 15 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. దారిపోడవునా యువకులు, చిన్నారులు, మహిళలు, కళాకారులు, వివిధ సంఘాల నేతలు, కార్మికులతో రాహుల్‌ ముచ్చటించారు. సినీనటి పూనమ్‌కౌర్‌ రాహుల్‌తో పాదయాత్రలో పాల్గొన్నారు. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులు రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ వారితో కలిసి  సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. చేనేత కార్మికులు వారి సమస్యలను రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం విధించిన జీఎస్టీని తొలగించి.. పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో 3వేల మంది విద్యార్థులతో ర్యాలీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు రాహుల్‌ను కలిసి వర్సిటీల సమస్యలపై వివరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని