Sachin Pilot: భారత్‌ జోడో యాత్రలోకి ‘రాజస్థాన్‌ సీఎం వివాదం’.. సచిన్‌ పైలట్‌ అసహనం!

రాజస్థాన్‌లో జోడో యాత్రను అడ్డుకుంటామని గుర్జర్ నేత చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా కాంగ్రెస్ నేత సచిన్‌ పైలట్‌ స్పందించారు. భాజపా యత్నాలు ఫలించవన్నారు. 

Published : 24 Nov 2022 02:04 IST

జైపుర్‌: కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ను ముఖ్యమంత్రిని చేయకపోతే.. భారత్‌ జోడో యాత్రను అడ్డుకుంటామని రాజస్థాన్‌ నేత విజయ్‌ సింగ్ భైంస్లా హెచ్చరించారు. ఈ యాత్రను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన వీడియో ద్వారా తమ డిమాండ్‌ను బయటపెట్టారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన సచిన్‌ పైలట్‌.. సీఎం వివాదానికి భారత్‌ జోడో యాత్రతో ఎందుకు ముడిపెడుతున్నారని అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం.  

‘ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను పూర్తిచేసుకుంది. ఇంకా ఒక్క ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు సచిన్‌ పైలట్‌ను సీఎం చేయాలి. అది జరిగితే రాష్ట్రంలోకి మీ యాత్రను ఆహ్వానిస్తాం. లేదంటే దానిని అడ్డుకుంటాం’ అని భైంస్లా వ్యాఖ్యానించారు. తమ వర్గం నేతను సీఎంను చేయడమో లేదంటే దీనిపై సమాధానం ఇవ్వడమో చేయాలని రాహుల్‌ను కోరారు. 2018లో తమ వర్గం నేత ముఖ్యమంత్రి అవుతారని భావించి కాంగ్రెస్‌కు ఓటేశామన్నారు.

‘ప్రస్తుత ప్రభుత్వంతో 2019, 2020లో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాం. కానీ అవి ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ ప్రభుత్వ వైఖరి వల్లే మేం ఈ హెచ్చరికకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది’ అని అన్నారు.  రాజస్థాన్‌ జనాభాలో గుర్జర్ కమ్యూనిటీ వాటా ఐదు నుంచి ఆరు శాతం వరకు ఉంటుంది. 40 సీట్లపై ఆ వర్గం ప్రభావం చూపుతుంది. తూర్పు రాజస్థాన్ వీరి ప్రాబల్యం ఉండగా.. షెడ్యూల్ ప్రకారం అక్కడ కూడా రాహుల్‌ సారథ్యంలో భారత్‌ జోడో యాత్ర సాగనుంది. డిసెంబర్ 3నాటికి ఆ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.  

భాజపా యత్నం ఫలించదు: పైలట్‌

కాగా, భైంస్లా వ్యాఖ్యలకు విరుద్ధంగా సచిన్‌ పైలట్ స్పందించారు. ‘ఈ యాత్రను ఆటంకపరిచేందుకు భాజపా ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేదు. అంతా కలిసి ఈ రాష్ట్రంలోకి జోడో యాత్రను స్వాగతిస్తాం. ఈ పాదయాత్ర కాంగ్రెస్‌కు కొత్త ప్రారంభం కానుంది’ అని పైలట్ అన్నారు. భారత్‌ జోడో యాత్ర రాజస్థాన్‌లో 15 నుంచి 18 రోజుల పాటు సాగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని