Congress: రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా, ఆరెస్సెస్ కుట్ర : కాంగ్రెస్‌

భాజపా, ఆరెస్సెస్‌లు రహస్య అజెండాతో రాజ్యాంగంలో మార్పులు చేసేందుకు కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. 

Updated : 10 Mar 2024 18:54 IST

దిల్లీ: రాజ్యాంగంలో మార్పులు చేయడానికి భాజపా (BJP)కు 400 సీట్లు అవసరమని ఆ పార్టీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే (Anantkumar Hegde) చెప్పడాన్ని కాంగ్రెస్ (Congress) తప్పుపట్టింది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) భాజపాపై విమర్శలు చేశారు. ‘‘రాజ్యాంగంలో మార్పులు చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం, భాజపా, ఆరెస్సెస్‌లు నియంతృత్వ పాలనను అమలు చేయాలని చూస్తున్నాయి. అదే వారి రహస్య అజెండా. ఎన్నికలు నిర్వహించకుండా, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే కుట్ర జరుగుతోంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత’’ అని ఖర్గే ఎక్స్‌లో పోస్టు చేశారు.

‘‘అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే నరేంద్ర మోదీ లక్ష్యం. ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, పౌర హక్కులు వాళ్లకు నచ్చవు. సమాజాన్ని విభజించి.. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయి. ప్రతిపక్షాలను అణగదొక్కి, నియంతృత్వ పాలనను అమలు చేయాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు ఈ కుట్రను అడ్డుకోవాలి. ఈ పోరాటంలో ఇండియా కూటమి మీకు తోడుగా ఉంటుంది’’ అని రాహుల్‌ ట్వీట్ చేశారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా ఎంపీ అనంత కుమార్ హెగ్డే శనివారం ఉత్తర కర్ణాటకలోని సిద్ధపూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పాలకులు అనవసరమైన మార్పులు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే లోక్‌సభ, రాజ్యసభలో భాజపాకు మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలి. అందుకే లోక్‌సభలో పార్టీకి 400 సీట్లు అవసరం. ఈ ఎన్నికల్లో మీరంతా భాజపాను గెలిపించాలి’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని