ఏపీలో స్థానిక ఎన్నికలపై అభిప్రాయ సేకరణ

ఏపీలో పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల ..

Updated : 28 Oct 2020 13:56 IST

అమరావతి: ఏపీలో పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ సేకరించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ ఎన్నికలు  నిర్వహిస్తున్న దృష్ట్యా గతంలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నట్టు నిమ్మగడ్డ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించినట్టు సమాచారం. స్థానిక ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్న అధికార పార్టీ వైకాపా మినహా మిగిలిన పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలిపారు.

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: తెదేపా
 రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమ పార్టీ సిద్ధంగా ఉందని, వెంటనే  ఎన్నికలు నిర్వహించాలని కోరామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటి నుంచి వైకాపా నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రత్యర్థులను బెదిరించి  పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకున్నారని వివరించారు. బెదిరింపులకు పాల్పడి చేసుకున్న ఏకగ్రీవాలన్నీ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఈసీకే భద్రత లేకపోతే ఎన్నికలు ఎలా సాఫీగా జరుగుతాయని ప్రశ్నించారు. కేంద్ర పోలీసు బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు అచ్చెన్నాయుడు చెప్పారు. 

స్థానిక సంస్థలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని సీపీఐ నేత రామకృష్ణ ఎస్‌ఈసీకి వివరించారు. అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడి పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు చేసుకుందని రామకృష్ణ ఆరోపించారు. దేశంలో జరుగుతున్న ఎన్నికలను పరిశీలించి, ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుంటే రాష్ట్రంలోనూ స్థానిక ఎన్నికలు నిర్వహించవచ్చని ఆయన వివరించారు. ఎస్‌ఈసీతో సమావేశం అనంతరం భాజపా నేత సత్యనారాయణ మాట్లాడుతూ... గతంలో జరిగిన ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి  తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరినట్టు చెప్పారు. బీఎస్పీ నేత పుష్పరాజ్‌ మాట్లాడుతూ... ఎన్నికలు మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని కోరామని చెప్పారు. కరోనా దృష్ట్యా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని, కేంద్ర పోలీసు బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు తెలిపారు. గతంతో  పోలిస్తే కరోనా కేసులు పెరుగుతున్నాయని,  ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీ కి సూచించినట్టు సీపీఎం నేత వెంకటేశ్వరరావు వెల్లడించారు. జనసేన పార్టీ ఈ-మెయిల్‌ ద్వారా అభిప్రాయాన్ని వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్‌ఈసీ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామని స్పష్టం చేసింది.

కొవిడ్‌ కారణంగా మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలను కమిషనర్‌ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశారని ఎన్నికల కమిషనర్‌ను అప్పట్లో విమర్శించిన వైకాపా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ఉంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నిర్వహిస్తున్న సమావేశానికి వెళ్లం అని వైకాపా ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా రమేశ్‌కుమార్‌ ముందుకు వెళ్లడాన్ని ఖండిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య కార్యదర్శి ఇచ్చే అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ముందు పార్టీలను సమావేశానికి పిలవడంలోనే ఎస్‌ఈసీకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతోందని అంబటి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని