ఉద్యోగాల్లో మహిళలకు కోటా.. సీఏఏ అమలు

పశ్చిమ బెంగాల్‌లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. ‘సోనార్‌ బంగ్లా సంకల్ప్‌ పత్ర’ పేరిట ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. పార్టీ సీనియర్‌....

Published : 22 Mar 2021 01:52 IST

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్‌ షా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. ‘సోనార్‌ బంగ్లా సంకల్ప్‌ పత్ర’ పేరిట ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఇక్కడ పార్టీ నేతలతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు, పీఎం కిసాన్‌ అరియర్స్‌, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో పే కమిషన్‌.. అంటూ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా హామీలను భాజపా తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.

ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఏడో పే కమిషన్‌ వర్తింపజేస్తామని భాజపా హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని పేర్కొంది. పీఎం- కిసాన్‌ అరియర్స్‌ను రూ.18వేల చొప్పున రాష్ట్రంలోని 75 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కోసం తొలి కేబినెట్‌ భేటీలోనే ఆమోదముద్ర వేస్తామని పేర్కొంది. 70 ఏళ్లుగా రాష్ట్రంలో నివాసముంటున్న శరణార్థులకు పౌరసత్వం కల్పించడంతో పాటు ఏటా రూ.10వేలు చొప్పున ఐదేళ్ల పాటు నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది.

మరిన్ని హామీలు..
* మహిళలకు కేజీ టు పీజీ ఉచిత విద్య

* రాష్ట్రంలో మూడు ఎయిమ్స్‌ల ఏర్పాటు

* ఆయుష్మాన్‌ భారత్‌ పథకం వర్తింపు

* ముఖ్యమంత్రి కార్యాలయంలో అవినీతి నిరోధానికి హెల్ప్‌లైన్‌

* ₹11వేల కోట్లతో సోనార్‌ బంగ్లా నిధి ఏర్పాటు

* బెంగాల్‌లోకి చొరబాట్లు లేకుండా కంచెల కట్టుదిట్టం

* అంతర్జాతీయంగా బెంగాలీ భాష గుర్తింపునకు కేంద్రం తన వంతు కృషి

* నోబెల్‌ బహుమతి తరహాలో ఠాగూర్‌ బహుమతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని