KCR: ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను: కేసీఆర్‌

ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని భారాస అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Updated : 13 Feb 2024 19:43 IST

నల్గొండ: ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని భారాస అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు.

‘‘కాలు విరిగినా కట్టె పట్టుకొని నల్గొండకు వచ్చా. ఇది రాజకీయ సభ కాదు.. ఉద్యమ సభ, పోరాట సభ.  ఫ్లోరైడ్‌ వల్ల నల్గొండ ప్రజల నడుములు వొంగిపోయాయి. ఆ నాడు బాధితులను దిల్లీకి తీసుకెళ్లి అప్పటి ప్రధానికి చూపించాం. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదు. 24 ఏళ్లుగా పక్షిలాగా తిరిగి రాష్ట్రం మొత్తం చెప్పాను. తెరాస ప్రభుత్వం వచ్చాకే ఫ్లోరైడ్‌ సమస్య పోయింది. ఇప్పుడు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్‌ రహిత జిల్లాగా మారింది. పోరాటం చేసి.. రాష్ట్రం తెచ్చి పదేళ్లు పాలించా. నా పాలనలో ఎవరికీ తక్కువ చేయలేదు. కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారు. నా ప్రాంతం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే.. ఎక్కడివరకైనా  పోరాడవచ్చు. పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఫలితం లేకపాయే అని అప్పట్లో నేనే పాట రాశా.

బస్వాపూర్‌ ప్రాజెక్టు పూర్తయ్యింది, దిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80శాతం పూర్తయ్యాయి. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు. ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన కృష్ణా జలాలు కేటాయించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగాం. ఇప్పుడు కృష్ణా జలాల్లో వాటా కోసం ట్రైబ్యునల్‌ ముందు పోరాడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా.. పిల్లి మాదిరిగా ఉండను. 

కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆట బొమ్మ కాదు..

కేసీఆర్‌ను తిరగనివ్వమంటున్నారు.. అంత మొనగాళ్లా? మీకు దమ్ముంటే మాకంటే గొప్పగా పాలించి చూపించండి. మేడిగడ్డకు వెళ్లి ఏం చేశారు.. అసెంబ్లీ అయ్యాక మేమూ వెళ్తాం. ఇప్పుడు కూడా ప్రాణహితలో 5వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. దమ్ముంటే.. ప్రాణహితలో నీటిని ఎత్తిపోయాలి. కేసీఆర్‌ను బద్నాం చేయాలని .. పొలాలు ఎండబెడతారా? కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆటబొమ్మకాదు. ప్రాజెక్టులో 200 కి.మీ సొరంగాలు, 1500 కి.మీ కాల్వలు ఉంటాయి. రెండు మూడు పిల్లర్లు కుంగిపోయాయన్నది వాస్తవమే. ఎన్నిసార్లు ఇలా పిల్లర్లు కుంగిపోలేదు.. సాగర్‌లో కుంగలేదా? రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానంటారా.. ఎన్ని గుండెలు మీకు. మంత్రులకు అంత కండకావరమా.. కళ్లు నెత్తికెక్కాయా? పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయి. రైతు చెప్పుతో కొడితే మూడు పళ్లు రాలిపోతాయి. మీకు చేతకాకపోతే.. చేతకాదని చెప్పాలి’’ అని కేసీఆర్‌ అన్నారు. భారాస నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కేశవరావు తదితరులు సభలో పాల్గొన్నారు. కొన్ని నెలల విరామం తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కేసీఆర్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని