TS News: కేసీఆర్‌ దిల్లీ మంతనాలు ఏంటి?: భట్టి విక్రమార్క

కాంగ్రెస్‌, భాజపా హుజూరాబాద్‌ ఎన్నికల్లో కలిసిపోయాయని మంత్రి కేటీఆర్‌ మాట్లాడటం సరికాదని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...

Updated : 30 Sep 2022 15:23 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, భాజపా హుజూరాబాద్‌ ఎన్నికల్లో కలిసిపోయాయని మంత్రి కేటీఆర్‌ మాట్లాడటం సరికాదని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

‘‘భాజపా మతతత్వ పార్టీ, కాంగ్రెస్‌ సెక్యులర్‌ పార్టీ. రెండూ భిన్న ధృవాలు. కేటీఆర్‌కు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. హుజూరాబాద్‌ ఎన్నికలో ఓటమి భయంతోనే కేటీఆర్‌ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈటలను గెలిపించడం కోసం కాంగ్రెస్‌ ఎందుకు పనిచేస్తుంది. తెరాస, భాజపాల మధ్య లోపాయకారీ ఒప్పందాలు ఉన్నాయి. ఈటల అవినీతిపై ప్రభుత్వం విచారణ ఎటుపోయింది. కేసీఆర్‌ దిల్లీ మంతనాలు ఏంటి? తెరాసను భాజపాలో కలిపే మంతనాలు జరిగాయా? రాష్ట్రంలో ప్రజా సమస్యలు టీఆర్‌ఎస్‌కు పట్టడం లేదు. కాంగ్రెస్‌ నాయకులపై బురద జల్లితే ప్రజలు నమ్మరు. గాంధీభవన్‌లో గాడ్సేలు ఉండరు... కాంగ్రెస్‌ భావజాలం ఉన్న వారే ఉంటారు. కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటం సరికాదు. ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్‌లోకి వస్తారనడం ఊహాజనితం. దళితబంధుపై భాజపా వైఖరి సరిగా లేదు. దళితబంధును ఆపడంలో భాజపా, తెరాస పాత్ర ఉంది. ఇద్దరు దొంగలు కలిసి దళితబంధును ఆపారు. బల్మూర్‌ వెంకట్‌ బలమైన అభ్యర్థి.  కాదని ఎవరన్నా అంటే అది వారి అవగాహనా రాహిత్యం. హైదరాబాద్‌ నిండా తెరాస ప్లెక్సీలతో నింపారు. ప్రతిపక్షాల ప్లెక్సీలు పెడితే హడావుడిచేసే అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారు?’’ అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని