CM Kcr: జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు.. పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్‌ నిర్ణయం

టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారనుంది. పార్టీ నేతలతో ఇవాళ ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దసరా రోజున మధ్యాహ్నం 1.19గంటలకు జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు.

Updated : 02 Oct 2022 20:24 IST

హైదరాబాద్‌: జాతీయ పార్టీ ఏర్పాటుపై తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ కసరత్తు తుది దశకు చేరింది. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో ఇవాళ ప్రగతి భవన్‌లో సమావేశమైన కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 5న దసరా రోజు మధ్యాహ్నం 1.19గంటలకు సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. 

దసరా రోజున ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో తెరాస విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం సహా మొత్తం 283 మంది సమావేశానికి హాజరు కానున్నారు. ముందుగా పార్టీ పేరును మార్చబోతున్నారు. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌గా ఉన్న పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ విస్తృత స్థాయి సమావేశం తీర్మానం చేయనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.19 నిమిషాలకు జాతీయ పార్టీ ప్రకటన చేయాలని నిర్ణయించారు. జాతీయ పార్టీకి సంబంధించి ఏం చేయబోతున్నారనేది ఆరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్‌ వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న పార్టీని జాతీయ రాజకీయాల్లో ప్రవేశించే విధంగా సాంకేతికంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ పార్టీగా పేరు మార్చి జాతీయ స్థాయిలో వెళ్లడం ద్వారా  పార్టీ జెండా, ఎన్నికల గుర్తుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రాథమికంగా భావిస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేసిన తర్వాత మిగతా నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. అదే రోజు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు, కార్మిక నేతలు, దళిత నాయకులతో సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నట్టు సమాచారం. డిసెంబరు 9న దిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన నేతలు, వివిధ సంఘాల నేతలను సభకు ఆహ్వానించి జాతీయ స్థాయిలో పార్టీకి సంబంధించిన అజెండాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశారు. పార్టీ ఎలా ఉండాలి, పార్టీ నిర్మాణం ఏవిధంగా ఉండాలి, ఏయే అంశాలపై ముందుకెళ్లాలనే దానిపై స్పష్టతతో ఉన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని