CM Revanth: హైదరాబాద్‌ నలువైపులా ఒకేవిధమైన అభివృద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి

మెట్రో రైలు, ఐటీ కంపెనీలు మేడ్చల్‌కు రావాలంటే మల్కాజిగిరి ఎంపీ సీటు కాంగ్రెస్‌ గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 09 Mar 2024 21:16 IST

హైదరాబాద్‌: మెట్రో రైలు, ఐటీ కంపెనీలు మేడ్చల్‌కు రావాలంటే మల్కాజిగిరి ఎంపీ సీటు కాంగ్రెస్‌ గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ప్రజాదీవెన సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

‘‘కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్‌కు అధికారం దక్కింది. ప్రజల తరఫున పోరాడినందుకే సంపూర్ణమైన మెజార్టీతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని కొందరు అంటున్నారు. దోచుకుని దాచుకున్న సొమ్ముతో ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారు. మన ప్రభుత్వాన్ని పడగొట్టే మొనగాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా? మహిళా రిజర్వేషన్ల గురించి కవిత మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. ధర్నా చౌక్‌ వద్దన్న వాళ్లే ఇవాళ ధర్నా చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే భయపడుతున్నారు.

పిల్లర్లు కుంగిన మేడిగడ్డ నుంచి నీళ్లు ఇవ్వాలని పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. పనిమంతుడు పందిరి వేస్తే కుక్కతోక తగిలి కూలినట్టుగా ఉంది పరిస్థితి. కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు అరవై ఏళ్లు అయినా చెక్కు చెదరలేదు. కేసీఆర్‌ తన ఫామ్‌హౌజ్‌లో కట్టిన ఇల్లు మూడేళ్లకే కూలిపోయేలా కట్టారా? ఇప్పుడున్న మెట్రో లైన్‌ అంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసిందే. పదేళ్లలో కొత్తగా ఒక్క కిలోమీటర్‌ కూడా మెట్రో మార్గాన్ని పొడిగించలేదు. హైదరాబాద్‌ నాలుగు వైపులా ఒకే విధంగా అభివృద్ధి జరగాలి. అందుకోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని