Maharashtra Crisis: మా ఎమ్మెల్యేలు అమ్మకానికి లేరు : కమల్‌నాథ్‌

సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్‌.. తమ పార్టీ నేతలు మాత్రం ఐకమత్యంగానే ఉన్నారని, ఎమ్మెల్యేలు ఎవరూ అమ్మకానికి లేరని (Not for Sale) పేర్కొంది.

Published : 22 Jun 2022 14:20 IST

పతనం అంచున మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం

ముంబయి: శివసేనకు (Shiv Sena) చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) తీవ్ర సంక్షోభం నెలకొంది. దీంతో మహావికాస్‌ అఘాడీ (MVA) సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్యపక్షాలు తమ ఎమ్మెల్యేలను చేజారకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్‌.. తమ పార్టీ నేతలు మాత్రం ఐకమత్యంగానే ఉన్నారని, ఎమ్మెల్యేలు ఎవరూ అమ్మకానికి లేరని (Not for Sale) పేర్కొంది. భాజపాకు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నామని రెబల్‌ శివసేన ఎమ్మెల్యేలు ప్రకటిస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఇటువంటి వ్యాఖ్యలు చేసింది.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Political Crisis) వేళ.. అక్కడి పరిస్థితులను చక్కబెట్టేందుకు ఏఐసీసీ పరిశీలకుడిగా సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను (Kamal Nath) కాంగ్రెస్‌ అధిష్ఠానం అక్కడకు పంపించింది. దీంతో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యపక్షాలైన ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో సంప్రదింపులు జరిపేందుకు కమల్‌నాథ్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా బారినపడడం వల్ల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయనతో చర్చిస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో శివసేన ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడం ఆ పార్టీ చేతుల్లోనే ఉందన్న ఆయన.. వారి ఎమ్మెల్యేలను ఎలా హ్యాండిల్‌ చేసుకుంటారో చూడాలన్నారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఐక్యతతో ఉన్నారని.. తమ ఎమ్మెల్యేలు అమ్మకానికి లేరంటూ కమల్‌ నాథ్‌ స్పష్టం చేశారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో 44 స్థానాలున్న కాంగ్రెస్‌ మంగళవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేయగా.. 42 మంది మాత్రమే ఉందుబాటులోకి వచ్చారు. అయితే, మంత్రిగా ఉన్న విజయ్‌ వాడెట్టివార్‌ విదేశీ పర్యటనలో ఉన్నారని, బుధవారం ఆయన నగరానికి చేరుకుంటారని ఏఐసీసీ సెక్రటరీ హెచ్‌కే పాటిల్‌ వెల్లడించారు. మరో ఎమ్మెల్యే తన స్వస్థలం నుంచి ముంబయికి చేరుకుంటారని.. తమ బృందంలో అందరూ ఐక్యతగానే ఉన్నామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని