Congress manifesto: కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో యువతకు ‘ఉపాధి హక్కు’?

Congress manifesto: యువ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పలు కీలక హామీలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉపాధి హక్కు, ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యల వంటి అంశాలను అందులో చేర్చనున్నట్లు తెలుస్తోంది.

Updated : 06 Mar 2024 11:05 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికల హామీల్లో ఉపాధి హక్కును చేర్చనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పరీక్ష పత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టాన్ని తీసుకొస్తామని యువతకు భరోసా ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. ఈ అంశాలను మ్యానిఫెస్టోలో (Congress manifesto) చేర్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని బదనావర్‌లో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజరుకానున్నారు. ఈ సభలో ‘ఉపాధి హక్కు’పై ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ త్వరలో ఖరారు చేయనున్న మ్యానిఫెస్టోలో ఇవన్నీ ఉంటాయని వెల్లడించాయి. ఇలాంటి పథకాన్ని తీసుకురావడం ఇదే తొలిసారని.. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇటువంటివి లేవని పార్టీ సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు. నిరుద్యోగ యువతకు కొంత భృతిని కూడా ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ పారదర్శకత తీసుకురావాలని పార్టీ యోచిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఓ చట్టాన్ని తీసుకొస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో పేపర్‌ లీకేజీల వ్యవహారాన్ని ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా రాహుల్ గాంధీ గమనించారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీని వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నట్లు గ్రహించారని వివరించాయి. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నాయి. యాత్ర సందర్భంగా కాంగ్రెస్ (Congress) వాగ్దానం చేసిన ‘న్యాయానికి ఐదు స్తంభాలు’ ఆధారంగానే మ్యానిఫెస్టో ఉంటుందని వెల్లడించాయి. ‘కనీస మద్దతు ధర’కు చట్టబద్ధత, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల భర్తీ, కులగణన, అణగారిన వర్గాలకు ఆర్థిక సాయం వంటి హామీలూ ఉంటాయని తెలిపాయి.

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం నేతృత్వంలోని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ మంగళవారం సమావేశమైంది. దాదాపు ఐదు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో ఎన్నికల ప్రణాళికకు ఓ తుదిరూపు ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ముసాయిదా రూపంలో ఉన్న మేనిఫెస్టోకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదం తెలిపాక ప్రజల్లోకి తీసుకొస్తామని చిదంబరం తెలిపారు.

ఉద్యోగ నియామకాల ప్రశ్నపత్రాల లీకేజీలతో యువత తీవ్ర ఇబ్బందులు పడుతోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారదర్శకతతో ఖాళీల భర్తీ జరిగేలా చూస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం భరోసా ఇచ్చారు. విద్యార్థుల భవితతో ఆటలాడుకునేందుకు ఎవరినీ అనుమతించేదే లేదన్నారు. యూపీ సహా దేశంలో అన్నిచోట్లా పేపర్ల లీకేజీలు నిత్యకృత్యమయ్యాయని ‘ఎక్స్‌’లో ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని