Uttar Pradesh: యూపీ ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్.. ప్రచార ర్యాలీలను రద్దు చేసిన కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై కరోనా మహమ్మారి ప్రభావం పడినట్లే కన్పిస్తోంది. యూపీ వ్యాప్తంగా చేపట్టాల్సిన అన్ని ప్రచార ర్యాలీలను రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ బుధవారం

Published : 05 Jan 2022 13:35 IST

నోయిడా సభను రద్దు చేసుకన్న యోగి ఆదిత్యనాథ్‌

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై కరోనా మహమ్మారి ప్రభావం పడినట్లే కన్పిస్తోంది. యూపీ వ్యాప్తంగా చేపట్టాల్సిన అన్ని ప్రచార ర్యాలీలను రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ బుధవారం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలువురు రాజకీయ నాయకులు కూడా వైరస్‌ బారినపడటంతో హస్తం పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నోయిడా ర్యాలీని రద్దు చేసుకున్నారు. నోయిడాలో గురువారం సీఎం ప్రచారం చేపట్టాల్సి ఉండగా.. అక్కడ కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాంగ్రెస్‌ లాగే బాజపా కూడా అన్ని ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలను రద్దు చేస్తుందా లేదా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. 

ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశంలో మూడో దశ ముప్పు పొంచి ఉన్న వేళ.. అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలు సూపర్‌ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతలు ఇటీవల కరోనా బారినపడ్డారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలాకు మంగళవారం వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా తన సిబ్బందికి కరోనా సోకడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుంది.

ఇదిలా ఉండగా.. బరేలీ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నిన్న చేపట్టిన మారథాన్‌ కార్యక్రమంలో అవాంచనీయ ఘటన చోటుచేసుకుంది. ఈ పరుగు పందెంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీదారులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. అయితే మారథాన్‌లో పాల్గొన్న అమ్మాయిల్లో చాలా మంది మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని