Politics: కాంగ్రెస్‌కు మరో షాక్‌.. తృణమూల్‌ గూటికి కీర్తి ఆజాద్‌!

కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ తగలింది. ఆ పార్టీ నేత కీర్తి ఆజాద్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సమక్షంలో.....

Published : 23 Nov 2021 19:56 IST

దిల్లీ: కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ తగలింది. మాజీ క్రికెటర్‌, ఆ పార్టీ నేత కీర్తి ఆజాద్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. ఆజాద్‌తో పాటు జేడీయూ ప్రధాన కార్యదర్శి పవన్‌ వర్మ కూడా తృణమూల్‌ గూటికి చేరారు. బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌కి సలహాదారుగా పనిచేసిన పవన్‌..2016 వరకు ఎంపీగా పనిచేశారు. జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగానూ సేవలందించారు. అనంతరం 2020లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అలాగే, కాంగ్రెస్‌ నుంచి 2019 అక్టోబర్‌లో బయటకు వచ్చి సొంతంగా పార్టీ ఏర్పాటు చేసిన అశోక్‌ తన్వార్‌ కూడా తృణమూల్‌ గూటికి చేరనున్నట్టు సమాచారం.  

ఈ సందర్భంగా కీర్తి ఆజాద్‌ మాట్లాడుతూ..  తాను మమతా బెనర్జీ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో పని ప్రారంభిస్తానన్నారు. బాజపా విభజన రాజకీయాపై పోరాడతామని తెలిపారు. ఈరోజు దేశాన్ని సరైన మార్గంలో నడిపించాలంటే మమత లాంటి వ్యక్తులు అవసరమన్నారు. కీర్తి ఆజాద్‌ బిహార్‌ మాజీ సీఎం భగవత్‌ ఝా ఆజాద్‌ తనయుడు. బిహార్‌లోని డర్భంగా నుంచి మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. 2019లో కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన భాజపాలో పనిచేశారు. క్రికెటర్‌ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కీర్తి ఆజాద్‌.. దిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవకతవకలపై అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీపై బహిరంగ ఆరోపణలు చేసి 2015లో భాజపా నుంచి బహిష్కరణకు గురయ్యారు.

మరోవైపు, దిల్లీ వచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కలుస్తుంటారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనబడటంలేదని తృణమూల్‌ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని