Congress: అర్థం కాకపోతే స్కూల్‌కెళ్లి చదువుకో: పీకేపై సల్మాన్‌ ఖుర్షిద్‌ మండిపాటు

విపక్ష కూటమికిగానీ, కాంగ్రెస్‌కుగానీ అధ్యక్షత వహించడం ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చిన హక్కు ఏమీ కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్ణయించుకోవాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ గురువారం ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీని, రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన

Published : 04 Dec 2021 01:27 IST

దిల్లీ: విపక్ష కూటమికిగానీ, కాంగ్రెస్‌కుగానీ అధ్యక్షత వహించడం ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చిన హక్కు ఏమీ కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్ణయించుకోవాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ గురువారం ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీని, రాహుల్‌ గాంధీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో జాతీయ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షిద్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ప్రశాంత్‌ కిషోర్‌కి ప్రజాస్వామ్యం గురించి తెలియకపోతే పాఠశాలకెళ్లి చదువుకోవాలని హితవు పలికారు.

‘‘ప్రజాస్వామ్యం పట్ల పీకే(ప్రశాంత్‌ కిషోర్‌)కి చాలా ఆసక్తి ఉన్నట్లు ఉంది. కాంగ్రెస్ కార్యకర్తల ప్రజాస్వామిక ఎంపికను ప్రశ్నించేందుకు ఆయన దైవత్వాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని బట్టి రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు చదివి తెచ్చుకున్న జ్ఞానం మానవ ప్రవర్తనను ప్రభావితం చేయదని అర్థమవుతోంది. రాజకీయం అంటే ఎన్నికల్లో గెలవడమే మాత్రమే కాదు. ఈ విషయం వ్యాపారం చేసే వాళ్లకు ఎలా తెలుస్తుంది?’’అని సల్మాన్‌ ఖుర్షిద్‌ విమర్శించారు. దైవత్వం, ప్రజాస్వామ్యం అనేవి విశ్వాసానికి సంబంధించినవని, ప్రజాస్వామ్యాన్ని ఇతరులెవరూ నిర్వచించలేరని సల్మాన్‌ అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం కాకపోతే, పాఠశాలకెళ్లి మళ్లీ చదువుకోవడం ప్రారంభించాలని ప్రశాంత్‌ కిషోర్‌కు సల్మాన్‌ సూచించారు.  

కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా కూడా పీకే ట్వీట్‌పై ట్విటర్‌లోనే స్పందించారు. ‘‘సిద్ధాంతాల పట్ల ఎలాంటి నిబద్ధత లేకుండా రాజకీయమే వృత్తిగా గల ఓ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే విషయాలపై ఎవరికైనా సలహాలు ఇచ్చుకోవచ్చు. కానీ, మన రాజకీయాలు ఎలా ఉండాలో ఆయన నిర్ణయించలేరు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్‌గాంధీ ‘దైవిక కర్తవ్యా’న్ని నిర్వహిస్తున్నారు’’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

Read latest Political News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని