Purandeswari: పొత్తులు సహా ఏ నిర్ణయమైనా అధిష్ఠానమే తీసుకుంటుంది: పురందేశ్వరి

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు చేసింది.

Published : 03 Mar 2024 22:32 IST

విజయవాడ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు చేసింది. 2 రోజుల పాటు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్‌ అధ్యక్షతన సమీక్ష చేపట్టారు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, మధుకర్‌ సమక్షంలో ఆశావహులు, పార్టీ నేతలతో ముఖాముఖిలు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి గత నెలలో దరఖాస్తులు ఆహ్వానించారు. సుమారు 2 వేల దరఖాస్తులు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆశావహుల బలాబలాలపై స్క్రీనింగ్‌ కమిటీ బేరీజు వేసింది. ఆదివారం 11 లోక్‌సభ నియోజకవర్గాల ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులతో సమీక్షలు జరిపారు. ఒంగోలు, బాపట్ల, నెల్లూరు, అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం నేతలతో ముఖాముఖిలు నిర్వహించారు. అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. సమావేశాల్లో పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. వివిధ అంశాలపై చర్చించి సమీక్షించుకున్నామని తెలిపారు. తాము సేకరించిన విషయాలను క్రోడికరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తామన్నారు. దీనిపై పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చించి ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తారని వెల్లడించారు. పొత్తులు సహా ఏ నిర్ణయం అయినా పార్టీ అధిష్ఠానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని