Arvind Kejriwal: కేంద్రం ‘ఆర్డినెన్స్‌’పై పోరు.. దీదీతో కేజ్రీవాల్ భేటీ!

దిల్లీ పాలనావ్యవహారాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేడు దీదీని కోల్‌కతాలో కలిసిన సందర్భంగా ఈ మేరకు మాట్లాడారు.

Published : 23 May 2023 22:44 IST

కోల్‌కతా: దిల్లీ (Delhi)లో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ (Ordinance)ను ఆప్‌ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పించేందుకు ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చినట్లు ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రంపై పోరాడేందుకు దేశవ్యాప్తంగా ఆయా పార్టీల మద్దతు కూడగడతామంటూ దిల్లీ సీఎం, ఆప్‌ (AAP) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)ని కలిశారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann)తో కలిసి కోల్‌కతా వెళ్లిన కేజ్రీవాల్‌.. అక్కడ దీదీతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. దిల్లీ పాలనా వ్యవహారాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దీనిపై పోరాటంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. డబుల్‌ ఇంజిన్‌ పాలన.. ట్రబుల్‌ ఇంజిన్‌లా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని భాజపా అపహాస్యం చేస్తోందని కేజ్రీవాల్‌ విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తూ.. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. గవర్నర్లను ఉపయోగిస్తూ రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. కేంద్రంపై పోరాటంలో భాగంగా అన్ని విపక్షాలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపాకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై ఆయా పార్టీల నేతల మధ్య చర్చలు సాగుతోన్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉండగా.. బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌, కేజ్రీవాల్‌లు ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌లా ఓ ‘రాజ్యసభ ప్లాన్‌’ను నీతీశ్‌ వద్ద ప్రతిపాదించారు. ‘దిల్లీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై అందరం కలిసి పోరాడతాం. భాజపాయేతర ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తే.. రాజ్యసభలో బిల్లు రూపంలోని ఆర్డినెన్స్‌ను ఓడించవచ్చని సూచించా. ఇదే జరిగితే.. ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌లా అవుతుంది. 2024లో భాజపా తిరిగి అధికారంలోకి రాదనే సందేశం దేశమంతటా వెళ్తుంది’ అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన నేడు మమతా బెనర్జీని కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని