Simultaneous polls: పార్లమెంట్‌లో మళ్లీ ‘జమిలి’ ప్రస్తావన.. కేంద్రం ఏమందంటే?

జమిలి ఎన్నికలపై కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టంచేసింది. ఒక్కోసారి ఒక్కోచోట ఎన్నికల నిర్వహణ భారీ వ్యయంతో కూడుకున్నదని.. అందువల్ల దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిదని అభిప్రాయపడింది.

Published : 15 Dec 2022 20:23 IST

దిల్లీ: ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం పార్లమెంట్‌లో మరోసారి చర్చకు వచ్చింది. దేశంలో లోక్‌సభ, అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) జరపడంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టంచేసింది. ఎన్నికల వ్యయం భారీగా పెరిగిపోతున్న వేళ జమిలి ఎన్నికలే మేలని అభిప్రాయపడింది. ఎన్నికలంటేనే భారీ బడ్జెట్‌తో కూడుకున్న వ్యవహారమని.. అదే దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల భారీ వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు ప్రభుత్వ ఖజనాకు ఆదా చేయవచ్చని పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభలో ఓ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎన్నికల చట్టాల్లో సంస్కరణలపై లా కమిషన్ ఇచ్చిన నివేదికలో పరిపాలనలో స్థిరత్వం కోసం లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించిందని మంత్రి తెలిపారు. జమిలి ఎన్నికలతో  ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అవ్వడంతో పాటు అధికార యంత్రాంగం పరిపాలన, శాంతిభద్రతలపై పనిచేసేందుకు ఆటంకాల్ని నివారించవచ్చన్నారు. నిత్యం ఏదో ఒకచోట ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి సుదీర్ఘంగా అమలుతో ఏర్పడే ప్రతికూల ప్రభావాన్ని కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. 

ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానంలో పార్లమెంట్‌ నుంచి స్థానిక సంస్థలకు లేదా పార్లమెంట్‌తో పాటే రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్నే జమిలి ఎన్నికలుగా పేర్కొంటారు. పోలింగ్‌ బూత్‌కి వెళ్లిన ఓటరు ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థ ప్రతినిధికి ఓటు వేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒక నిర్ణీత వ్యవధిలో ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. దీంతో ఏటా విడివిడిగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవసరం ఉండదు. గతంలో ఈ విధానం అమలులో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా బ్రేక్‌ పడింది. లోక్‌సభ, అసెంబ్లీలకు 1951-52, 1957, 1962, 1967లలో ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. అయితే, 1968, 1969లలో కొన్ని అసెంబ్లీలు రద్దు కావడంతో ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. అయితే, అదే తరహాలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు భాజపా ప్రయత్నిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని