Congress: గాంధీ కుటుంబం ఆశీస్సులు మా ఇద్దరికీ ఉన్నాయ్‌: థరూర్‌

కాంగ్రెస్‌(Congress) పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎన్నిక తేదీ దగ్గరపడుతుండటంతో అధ్యక్ష బరిలో నిలిచిన మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌ తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు.

Published : 10 Oct 2022 01:12 IST

ముంబయి: కాంగ్రెస్‌(Congress) పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎన్నిక తేదీ దగ్గరపడుతుండటంతో అధ్యక్ష బరిలో నిలిచిన మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌ తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్ర పీసీసీ కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష బరిలో నిలిచిన తమ ఇద్దరికీ గాంధీ కుటుంబం ఆశీస్సులు ఉన్నాయని.. ఎవరిపట్లా పక్షపాతం లేదన్నారు. 2024 ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఖర్గేను అధికారిక అభ్యర్థిగా, తనను అనధికారిక అభ్యర్థిగా పేర్కొంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.

2024 తర్వాత భాజపా ప్రతిపక్షానికే పరిమితమవుతుందని.. అందుకు ఆ పార్టీ సన్నద్ధంగా ఉండాలని థరూర్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ మార్పులు అవసరమన్న ఆయన.. ఆ మార్పునకు తానొక ఉత్ప్రేరకంగా ఉంటానని భావిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ ఈ దేశాన్ని చక్కగా నడిపించిందని.. ఎంతోమంది అనుభవజ్ఞులు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఓటర్ల విశ్వాసాన్ని గెలిపించాలన్నారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు నానా పటేలో  హాజరు కాలేదు. దీనిపై థరూర్‌ స్పందిస్తూ.. నానా పటోలేతో తాను మాట్లాడానని.. ఆయనకు ముందే వేరే పని ఉండటం వల్లే హాజరుకాలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని