విశాఖపై జగన్‌ రహస్య జీవోలిస్తున్నారు: ఉమా

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆయన అనుచరులు విశాఖలో భూదందాలు జరుపుతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. బలవంతంగా భూములు లాక్కుంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని

Updated : 03 Jan 2020 19:08 IST

విజయవాడ: రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆయన అనుచరులు విశాఖలో భూదందాలు జరుపుతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. బలవంతంగా భూములు లాక్కుంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడ తెదేపా కార్యాలయంలో మాజీ మంత్రి జవహర్‌, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి దేవినేని మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రాజధానిని విశాఖకు తరలించేందుకు యత్నిస్తున్నారన్నారు. దీనికోసం రహస్య జీవోలు సైతం ఇస్తున్నారని ఆరోపించారు. ఆ ఉత్తర్వులపై సంతకాలు చేసే ముందు అధికారులు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి ఫొటోను ముందు ఉంచుకోవాలని ఎద్దేవా చేశారు. జగన్‌ అక్రమాలకు సహకరించే అధికారులు మున్ముందు సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని దేవినేని హెచ్చరించారు.

దళితులు చైతన్యం లేనివారు కాదు

రాజధాని అమరావతిలో గతంలో తెదేపా ప్రభుత్వం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిందని పేర్కొంటున్న వైకాపా నేతలు, మంత్రులు అందుకు సంబంధించి సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని మాజీ మంత్రి జవహర్‌ డిమాండ్‌ చేశారు. దళితుల అసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని దళితులు చైతన్యం లేని వారు కాదన్నారు. ఒకవేళ అదే జరిగితే తాను దళితుల తరఫున ముందుండి పోరాడుతానని తెలిపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన భార్య పేరిట కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నిజాలు మాట్లాడకుండా.. ‘నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ’ చిలక పలుకులు పలుకుతున్నారని జవహర్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని