విశాఖ రైల్వే జోన్‌పై నోరు మెదపరేం?: మధు

అమరావతిని రాజధానిగా ఆనాడు పార్టీలన్నీ అంగీకరించాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. వైకాపా సహా అన్ని పార్టీలూ ఇందుకు అంగీకారం తెలిపాయని గుర్తుచేశారు. కానీ, దానికి భిన్నంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు.

Published : 14 Jan 2020 12:45 IST

అమరావతి: అమరావతిని రాజధానిగా ఆనాడు పార్టీలన్నీ అంగీకరించాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. వైకాపా సహా అన్ని పార్టీలూ ఇందుకు అంగీకారం తెలిపాయని గుర్తుచేశారు. కానీ, దానికి భిన్నంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. మూడు రాజధానుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు. రైతులపై పోలీసు నిర్బంధాన్ని తక్షణమే ఆపాలన్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం సరికాదన్నారు. అన్ని ప్రాంతాలకూ సమదూరం దృష్ట్యా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగుతున్న అమరావతినే పరిపాలన రాజధానిగా కొనసాగించాలని తమ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. రైతులు, వ్యాపారులు, రైతుల కూలీలతో చర్చించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరారు. వికేంద్రీకరణ పేరుతో రాజధానిని ముక్కలు చేయడం ప్రజలకు సౌలభ్యంగా ఉండదన్నారు. పరిపాలన వికేంద్రీకరణతో సమగ్రాభివృద్ధి జరుగుతుందని చెప్పడం వాస్తవాలు వక్రీకరించడమేనన్నారు. విశాఖ రైల్వే జోన్‌, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నోరు మెదపకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేక హోదా కేంద్రం నుంచి రాబట్టకుండా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం తీవ్ర తప్పిదమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 
సంక్రాంతి జరుపుకోవడంలేదు: రామకృష్ణ
అమరావతి రైతులకు మద్దతుగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అమరావతి రాజధానిపై వివాదం సృష్టించి రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల ఫలితంగా అమరావతి రైతులు వీధులపాలయ్యారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని