రూల్‌154 ప్రకారం ఛైర్మన్‌ నిర్ణయం:యనమల

శాసన మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుందని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కొన్ని పొరపాట్లు జరిగినా.. ఛైర్మన్‌ నిర్ణయమే అంతిమం అని చెప్పారు. శాసన మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సెలెక్ట్‌ కమిటీ సిఫార్సు...

Published : 22 Jan 2020 22:16 IST

అమరావతి: శాసన మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుందని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కొన్ని పొరపాట్లు జరిగినా.. ఛైర్మన్‌ నిర్ణయమే అంతిమం అని చెప్పారు. శాసన మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సెలెక్ట్‌ కమిటీ సిఫార్సు చేస్తూ ఛైర్మన్‌ షరీఫ్‌ తీసుకున్న నిర్ణయంపై యనమల హర్షం వ్యక్తం చేశారు. మండలి వాయిదా వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభలోనూ బిల్లులు ప్రవేశపెట్టే విషయంలో ప్రభుత్వం నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. శాసనసభలో స్పీకర్‌కు నిబంధనలు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే బిల్లులను ఆమోదించుకుని ఎలా వెళ్తారని ఆయన మండిపడ్డారు. బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి వెళ్తే ప్రభుత్వానికున్న ఇబ్బందేమిటిని దుయ్యబట్టారు. నిబంధన 154 ప్రకారం మండలి ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని తాము వ్యతిరేకించామని చెప్పారు. ఛైర్మన్ షరీఫ్‌పై వైకాపా సభ్యుల దాడి చేసేందుకు యత్నించారని.. దీన్ని ఖండిస్తున్నామని చెప్పారు. నారా లోకేశ్‌పై మంత్రి అనిల్‌ దాడి చేసే ప్రయత్నం చేశారని యనమల ఆరోపించారు.

జగన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది: బుద్ధా

బిల్లుల విషయంలో వైకాపా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లాలని ప్రయత్నించిందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. వైకాపా సభ్యులు మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ను బెదిరించాలని చూశారని ఆరోపించారు. అయినా ఆయన బెదిరింపులకు లొంగలేదన్నారు. ఛైర్మన్‌ను ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తిగతంగా దూషించారని బుద్ధా ఆరోపించారు. అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు భగవంతుడు కూడా ఒప్పుకోలేదని వ్యాఖ్యానించారు. ఇవాల్టి నుంచి జగన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని