ప్రైవేటుఉద్యోగులకు భరోసా కల్పించండి:సంజయ్‌

రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కోరారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ధాన్యం... 

Published : 17 Apr 2020 01:27 IST

ఆ మేరకు ప్రభుత్వం ప్రకటన చేయాలి
ధాన్యం కొనుగోలు బస్తాలను త్వరగా అందించాలి
సీఎస్‌తో ఫోన్‌లో మాట్లాడిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కోరారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కోసం బస్తాలను త్వరగా అందించాలని.. లోడింగ్, అన్‌లోడింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొన్నిచోట్ల డ్రా విధానం, మరికొన్ని చోట్ల టోకెన్ విధానం అమల్లో ఉండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారని.. ఒకే విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరి పంటకు రూ. 1,835 మద్దతు ధర కల్పించినప్పటికీ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మేస్తున్నారని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. కందులు కొనుగోలు చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో తక్షణమే నగదు జమచేయాలని.. కొనుగోలు చేసిన కందులను ప్రభుత్వం పేదలకు రాయితీపై అందించాలని కోరారు.

అత్యవసర సేవలకు ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ని తీసుకోండి..

రేషన్ పంపిణీలో అధికారులకు కింది స్థాయి ఉద్యోగులు పూర్తి వివరాలు అందించకపోవడంతో గందరగోళం నెలకొందని సంజయ్‌ అన్నారు.  లాక్‌డౌన్ కాలంలో అత్యవసర సేవల కోసం ఫీల్డ్ అసిస్టెంట్స్‌ను విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. విడతల వారీగా భాజపా కార్యకర్తలు పేదలు, కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారని.. వారికి ఎలాంటి ఇబ్బందిల లేకుండా పంపిణీకి అనుమతించాలని సీఎస్‌ని ఆయన కోరారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ వద్ద వలస కూలీలను ఓ పోలీస్‌ అధికారి అడవిలో వదిలిరావడం దారుణమన్నారు.

ప్రైవేటు ఉద్యోగులకు భరోసా కల్పించండి..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు భరోసా కలిగేలా ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని బండి సంజయ్‌ సీఎస్‌ను కోరారు.  కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు భాజపా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది పడుతున్న ఇబ్బందులపై లిఖితపూర్వకంగా లేఖ ద్వారా వివరాలు అందిస్తానని సీఎస్‌కు సంజయ్‌ తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని