Atchannaidu: పిన్నెల్లీ... మాచర్ల మీ జాగీరా?: అచ్చెన్నాయుడు

‘‘మాచర్ల ఏమైనా వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జాగీరా? అక్కడ ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేయకూడదా?...’’

Updated : 17 Dec 2022 08:17 IST

ఈనాడు, అమరావతి: ‘‘మాచర్ల ఏమైనా వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జాగీరా? అక్కడ ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేయకూడదా?...’’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‘‘దాడిచేసిన వైకాపా వాళ్లను వదిలేసి, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బ్రహ్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడమేంటి? ఎమ్మెల్యే తమ్ముడు వెంకట్రామిరెడ్డి నాయకత్వంలోనే తెదేపా కార్యాలయంపై దాడి జరిగింది. అయిదు కార్లు ధ్వంసం చేశారు. తెదేపా సానుభూతిపరుల దుకాణాలు తగలబెట్టారు. అంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకోవడం దుర్మార్గం. ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు మాచర్లను గూండాగిరితో మూడున్నరేళ్లుగా చేతిలో పెట్టుకున్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవడంతో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. వారి దుశ్చర్యల్ని పోలీసులు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. బ్రహ్మారెడ్డి ప్రాణాలకు ముప్పుంది. బ్రహ్మారెడ్డికి చిన్నపాటి అపాయం కలిగించినా తెదేపా కార్యకర్తలతో పిన్నెల్లి ఇంటిని ముట్టడిస్తాం. బ్రహ్మారెడ్డిని చూసి పిన్నెల్లి రోజూ భయపడుతూ బతుకుతున్నారు. నీ ఓటమికి రోజులు లెక్కపెట్టుకో....’’ అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.


వైకాపా గూండాల్ని వదిలేసి... తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జి చేయడమేంటి?

పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

‘‘వైకాపా రౌడీమూకలు పోలీసుల సహకారంతో మరోసారి తెదేపా శ్రేణులపై దాడికి పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనం. దాడిచేసిన వైకాపా గూండాల్ని వదిలేసి, తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేయడం దారుణం. తెదేపా మాచర్ల నియోజవర్గ ఇన్‌ఛార్జి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం వైకాపాకి కొమ్ముకాయడమే. తెదేపా వర్గీయుల కార్లు తగలబెట్టి, దాడులకు పాల్పడిన వైకాపా గూండాల్ని తక్షణమే అరెస్టుచేయాలి.  గాయపడ్డ తెదేపా నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటాం.’’


రాష్ట్రమంతా మాచర్ల తరహా పరిస్థితులే: ధూళిపాళ్ల నరేంద్ర

‘‘జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రమంతా మాచర్ల తరహా పరిస్థితులే ఉన్నాయి. పల్నాడులో సమసిపోయిన ఫ్యాక్షన్‌ రాజకీయాలు... వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మళ్లీ ఆజ్యం పోసుకున్నాయి. తెదేపా ఇన్‌ఛార్జి బ్రహ్మారెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పిన్నెల్లి ఇలాంటి పనులకు తెగబడుతున్నారు.  బ్రహ్మారెడ్డి ఇంటిని, తెదేపా కార్యాలయాన్ని వైకాపా గూండాలు తగలబెడుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.’’


రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు: మాజీ మంత్రి జవహర్‌

‘‘రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. పల్నాడులో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా వైకాపా చేతుల్లోకి వెళ్లిపోయింది. అక్కడ జరిగిన విధ్వంసానికి హోం మంత్రి, డీజీపీ బాధ్యత వహించాలి. మాచర్ల రౌడీల రాజ్యంగా మారింది. తెదేపా శ్రేణులపై సీఎం జగన్‌ కనుసన్నల్లోనే దాడులు జరిగాయి. జగన్‌ పాలనలో ప్రజలు భయభ్రాంతులతో బతుకుతున్నారు.’’  


మోకాళ్లపై కూర్చోబెడతాం జాగ్రత్త: మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు

‘‘వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి పరిస్థితి పిల్లి కంటే హీనంగా తయారైంది. తెదేపా ఇన్‌ఛార్జి బ్రహ్మారెడ్డిని చూసి రోజూ భయంతో బతుకుతున్నారు. అందుకే ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే గడువున్నా వైకాపా గూండాలు దాడులు, విధ్వంసాలతో ప్రజల్ని భయపెడుతున్నారు.  తెదేపా అధికారంలోకి రాగానే పిన్నెల్లిని మాచర్లలో బ్రహ్మనాయుడి విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చోబెడతాం.’’


అది ప్రభుత్వం చేయించిన దాడి: వర్ల రామయ్య

‘‘మాచర్లలో జరిగిన దౌర్జన్యకాండ ప్రభుత్వ ప్రేరేపిత హింస. తెదేపాకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రభుత్వమే దాడికి పురిగొల్పింది. శాంతిభద్రతలను కాపాడటంలో పూర్తిగా విఫలమైంది.’’


జగన్‌రెడ్డి రాజీనామా చేయాలి: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

‘‘ వైకాపా సమాధికి మాచర్ల ఘటన తొలి పునాదిరాయి. మాచర్లలో జరిగిన దాడికి కర్త, కర్మ, క్రియ జగన్‌రెడ్డే. తెదేపా చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమానికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే దాడులు చేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి విధ్వంసాలకు పాల్పడటం హేయం. ఈ ఘటనకు జగన్‌రెడ్డి బాధ్యత వహించి, వెంటనే రాజీనామా చేయాలి.’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని