Andhra news:అడ్డుకోవడమే ఎజెండా

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన యువగళం పాదయాత్రను ఏదోఒక సాకుతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.

Updated : 25 Jan 2023 07:35 IST

యువగళం కోసం 400 రోజులకు అనుమతి కోరితే... 3 రోజులకిస్తారా
తెదేపా నేతల మండిపాటు

ఈనాడు, అమరావతి: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తలపెట్టిన యువగళం పాదయాత్రను ఏదోఒక సాకుతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. కనీవినీ ఎరుగని విధంగా షరతుల పేరుతో ఆంక్షలు విధించడం, కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు 400 రోజులపాటు పాదయాత్రకు అనుమతి కోరితే.... డీజీపీ స్పందించకుండా, స్థానిక పోలీసులు మాత్రం 3 రోజులకే అనుమతివ్వడం ప్రభుత్వ కుట్రను బహిర్గతం చేస్తోందని తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి. గతంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు... నాటి తెదేపా ప్రభుత్వం పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్రకు ఒకేసారి అనుమతిచ్చిందని, అప్పటి డీజీపీ మూడు షరతులే పెట్టారని గుర్తుచేశాయి. ప్రతిపక్షాల రాజకీయ కార్యకలాపాల్ని అక్రమమార్గాల్లో కట్టడి చేయాలని చూస్తున్న ప్రభుత్వం... ఆ కుట్రలో భాగంగానే లోకేశ్‌ పాదయాత్రకూ అడ్డుతగులుతోందని తెదేపా మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తింది. ‘2017లో ప్రతిపక్ష నేతగా జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు.... పాదయాత్రకు సంబంధించి ఆయా జిల్లాల ఎస్పీలు, సీపీలకు ముందుగానే తెలపాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పాదయాత్ర జరగాలని, జనాన్ని పార్టీ వాలంటీర్లు నియంత్రించాలనే అప్పట్లో డీజీపీ షరతులు పెట్టారు’ అని తెదేపా పేర్కొంది. జగన్‌ పాదయాత్రకు అనుమతిస్తూ అప్పట్లో డీజీపీ ఇచ్చినఉత్తర్వుల కాపీని ఆ ప్రకటనకు జతచేసింది.

లోకేశ్‌ పాదయాత్రకు పలమనేరు డీఎస్పీ విధించిన షరతులు, వాటిపై తెదేపా స్పందన... 

షరతు 1: మూడు రోజులకు అనుమతి

తెదేపా: 400 రోజులపాటు జరిగే పాదయాత్ర పొడవునా అనిశ్చితి పరిస్థితి కల్పించేందుకే ఆ నిబంధన. 15 ఆంక్షలతో కుప్పం నియోజకవర్గం వరకు 3 రోజులకు అక్కడి పోలీసులు అనుమతిచ్చారు. పాదయాత్ర ఏ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంటే అక్కడే అనుమతులు ఇస్తారా? గతంలో ఏ నాయకుడి పాదయాత్రకైనా ఇలాంటి పరిస్థితి ఉందా?

షరతు 2: శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్టు ఫిర్యాదులొస్తే ఎప్పుడైనా అనుమతి రద్దు చేయవచ్చు.

తెదేపా: శాంతిభద్రతల్ని కాపాడే బాధ్యత తనది కాదని పోలీసు యంత్రాంగం చేతులు దులిపేసుకోవాలనుకుంటోంది. ఏదో ఒక సాకుతో యువగళాన్ని అడ్డుకునేందుకే ఆ నిబంధన. 

షరతు 3: రహదారులపై సభలు నిర్వహించరాదు. డీఎస్పీ అనుమతితోనే సభలు పెట్టాలి.

తెదేపా: అప్పట్లో జగన్‌ యాత్రకు అలాంటి షరతులేమీ పెట్టలేదు. 

షరతు 4: పాదయాత్రను బహిరంగ సభగా మార్చకూడదు. ట్రాఫిక్‌ జామ్‌ చేయకూడదు.

తెదేపా: అప్పట్లో జగన్‌ పాదయాత్ర పొడవునా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించిన విషయాన్ని పోలీసులు మరచిపోయినట్లున్నారు. ట్రాఫిక్‌ నిర్వహణ పోలీసుల బాధ్యత కాదా?

షరతు 5: మైక్‌ వాడాలంటే డీఎస్పీ అనుమతి ఉండాల్సిందే.

తెదేపా: మైక్‌ లేకపోతే... పాదయాత్రకు వేలాదిగా తరలి వచ్చే ప్రజలందరికీ మాటలు ఎలా వినిపిస్తాయి? అప్పట్లో జగన్‌ సింగిల్‌ మైక్‌తోనే మాట్లాడారా?

షరతు 6: రహదారులను స్తంభింపజేయకూడదు.

తెదేపా: రహదారులపై ప్రజలు, వాహనాలు ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగానిది.

షరతు 7: పాదయాత్రలో అనుమతించిన వాహనాలే ఉండాలి.

తెదేపా: పాదయాత్రలో పాల్గొనే వాహనాల్లో ఏదైనా చెడిపోతే, ఈ షరతును చూపి వాహనాల్ని కుదించాలన్నది పోలీసుల ఆలోచన. 

షరతు 8: పాదయాత్రకు వచ్చే వారిని నియంత్రించేందుకు పార్టీనే పురుష, మహిళా వాలంటీర్లను పెట్టాలి.

తెదేపా: పోలీసులు నిర్వర్తించాల్సిన బాధ్యతల్నీ ప్రతిపక్ష పార్టీలకే అప్పగిస్తున్నారు.

షరతు 9: పాదయాత్ర నిర్వాహకులు షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలి.

తెదేపా: హాజరయ్యే ప్రజలు, వాతావరణాన్ని బట్టి చిన్నచిన్న మార్పులు జరిగినా... ఈ షరతుతో యాత్రను అడ్డుకోవాలన్నది వారి ఉద్దేశం.

షరతు 10: డీజే, లౌడ్‌ స్పీకర్లు వాడకూడదు.

తెదేపా: గతంలో జగన్‌ వాడలేదా? ఇప్పుడెందుకు ఈ నిబంధన?

షరతు 11: టపాసులు కాల్చకూడదు.

తెదేపా: ప్రజలు ఎవరైనా ఉత్సాహంతో అలాంటివేమైనా చేస్తే ఆ నిబంధనను చూపి ఆటంకం కలిగించడం దాని ఉద్దేశం.

షరతు 12: డ్రోన్‌ కెమెరాలను నిబంధనల మేరకే ఉపయోగించాలి.

తెదేపా: యువగళం యాత్రకు వచ్చే ప్రచారాన్ని ఏదోఒక మిషతో అడ్డుకునే కుట్రలో భాగమే ఈ షరతు.

షరతు 13: పాదయాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించే బాధ్యత నిర్వాహకులదే

తెదేపా: జగన్‌ పాదయాత్ర ప్రారంభం నుంచి ముగిసేదాకా భద్రత కల్పించాలని అప్పట్లో డీజీపీ ఆదేశాలిచ్చారు. దానికి భిన్నంగా యువగళంలో పాల్గొనేవారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత తమది కాదని జగన్‌ ప్రభుత్వం చెప్పడం విడ్డూరం.

షరతు 14: పాదయాత్రలో పాల్గొన్నవారు విధ్వంసాలకు పాల్పడితే నిర్వాహకులదే బాధ్యత.

తెదేపా: యువగళంలో వైకాపా శక్తులు చొరబడి హింసకు ప్రేరేపించే అవకాశం ఉన్నందున, యాత్రకు భద్రత కల్పించాలని కోరుతూ ఇటీవలే డీజీపీకి తెదేపా లేఖ రాసింది. ఆ నేపథ్యంలో ఈ నిబంధన పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.

షరతు 15: పైన పేర్కొన్న షరతులన్నిటికీ నిర్వాహకులు కట్టుబడి ఉండాలి. ఏ ఒక్కటి ఉల్లంఘించినా పూర్తి బాధ్యత నిర్వాహకులదే.

తెదేపా: ఏదోఒక సాకుతో యాత్రకు అడ్డు తగలాలన్న ప్రభుత్వ ఉద్దేశం వెల్లడవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని