ప్రజా సమస్యలపై గొంతెత్తుదాం

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఎండగట్టాలని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

Updated : 30 Jan 2023 05:32 IST

కలిసి వచ్చే పార్టీలతో కేంద్రాన్ని నిలదీయాలి
గవర్నర్ల అప్రజాస్వామిక  విధానాలను ఎండగడదాం
ప్రమాదకర ఆర్థిక విధానాలపై ప్రశ్నించాలి
భారాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఎండగట్టాలని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పార్లమెంటు జరిగినన్ని రోజులూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజా సమస్యలపై గొంతెత్తాలని, కేంద్రం చేస్తున్న తప్పులను ప్రజల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ దిశగా భారాసతో కలిసి వచ్చే పార్టీలతో కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని చెప్పారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన భారాస పార్లమెంటరీ పక్ష సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. కేంద్రం తీరుతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. ‘‘కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు దేశ సమగ్రత, అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి.  దేశ ప్రజలు తమ కష్టార్జితంతో కూడబెట్టుకుంటున్న సంపదనంతా తమ కార్పొరేట్‌ స్నేహితులకు కట్టబెడుతున్నారు. వారిపై ప్రేమ కురిపిస్తూ.. రూ.లక్షల కోట్ల రుణాలను రద్దు చేస్తోన్నారు. లాభాలను ప్రైవేటుపరం చేస్తూ...నష్టాలను దేశ ప్రజల మీద రుద్దుతున్నారు. ఇలాంటి ప్రమాదకర ఆర్థిక విధానాల మీద ఉభయ సభల్లో గొంతు వినిపించాలి.  

సామాన్యుడి బతుకు భారమవుతున్నా పట్టింపేదీ?

సమాఖ్య స్ఫూర్తికి భాజపా ప్రభుత్వం తూట్లు పొడుస్తూ.. రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రగతి పథంలో పయనిస్తోన్న తెలంగాణ వంటి రాష్ట్రానికి ఆర్థికంగా అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తూ.. ప్రగతిని అడ్డుకుంటున్న కారణమేందో జాతికి చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించాలి. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ సహా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడి బతుకు రోజు రోజుకూ భారమైపోతున్నా కేంద్రానికి పట్టింపులేదు. వారి కష్టాలను పార్లమెంటు ఉభయ సభల ద్వారా దేశ ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. రోజు రోజుకూ దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. దేశ యువతను ఏమాత్రం పట్టించుకోకుండా, వారికి ఉద్యోగ భద్రత కల్పించకుండా, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న తీరుపై మాట్లాడాలి. తెలంగాణకు రావాల్సిన విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. దీనిపైనా నిలదీయాలి’’ అని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఉభయ సభల్లో పార్టీ నేతలు కె.కేశవరావు(రాజ్యసభ), నామా నాగేశ్వరరావు(లోక్‌ సభ), ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, కె.ఆర్‌.సురేష్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్‌, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి, దీవకొండ దామోదర్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోత్‌ కవిత, పసునూరి దయాకర్‌, బొర్లకుంట వెంకటేశ్‌, పోతుగంటి రాములు పాల్గొన్నారు.


ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కేంద్రం కట్టబెడుతోంది. వారి కంపెనీల డొల్లతనం బైటపడుతూ.. షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతూ.. రూ.లక్షల కోట్లు ఒక్క రోజులోనే నష్టపోతున్నారనే వాస్తవాన్ని దేశం గమనిస్తోంది. వారి లాభాలు, సంపదంతా నీటిబుడగలేనని స్పష్టమవుతోంది. ఇటువంటి ఆర్థిక అవకతవకలకు దోహదం చేసే విధంగా దేశ సంపదనంతా ప్రైవేటుపరం చేస్తూ కేంద్రం తీరని నష్టం చేస్తోంది.

రాష్ట్రాలను నిర్వీర్యపరిచే దిశగా గవర్నర్లను కేంద్రం తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం అప్రజాస్వామికం. రాష్ట్ర క్యాబినెట్‌ సహా అత్యున్నత సభలైన శాసనసభ, శాసనమండలి తీసుకున్న నిర్ణయాలను కూడా ఉద్దేశపూర్వకంగా పెండింగులో పెడుతూ.. గవర్నర్లు బేఖాతరు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేయాలని.. అభివృద్ధి, పాలనను అడ్డుకోవాలని చూస్తున్న గవర్నర్ల అప్రజాస్వామిక విధానాలను, కేంద్రం వైఖరిని పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలి.

కేసీఆర్‌


అవసరమైతే రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ!
- అఖిల పక్ష సమావేశంలో   కేంద్రం తీరును బట్టి నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: అఖిల పక్ష సమావేశంలో తాము లేవనెత్తే అంశాలపై కేంద్ర ప్రభుత్వ స్పందనను బట్టి పార్లమెంటులో ఎలా వ్యవహరించాలో నిర్ణయించనున్నట్లు భారాస వర్గాలు తెలిపాయి. దిల్లీలో సోమవారం జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో గవర్నర్‌ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదని.. బిల్లులను ఆమోదించకుండా అట్టిపెట్టుకుంటున్నారని.. ఇతర రాష్ట్రాల్లోనూ గవర్నర్లు ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ.. గవర్నర్ల వ్యవస్థపై భారాస ప్రశ్నించనున్నట్లు తెలిసింది. అదానీ విషయంలో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రూ.లక్ష కోట్ల దాకా నష్టం వాటిల్లిందని, నిత్యావసర ధరలు, సామాన్యునిపై పెట్రో ధరల ప్రభావంపై భారాస ఎంపీలు నిలదీయనున్నట్లు సమాచారం. ఇలాంటి అంశాలన్నింటిపైనా కేంద్రం చర్చకు అవకాశం కల్పిస్తుందా? లేదా? అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఒకవేళ కేంద్రం నుంచి సరైన సమాధానం రాకపోతే.. అవసరమైతే రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా బహిష్కరించే యోచనలో ఉన్నట్లు సమాచారం.


మహాత్ముని ఆదర్శాలు దేశానికి తక్షణ అవసరం: సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కుల, మత వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మాగాంధీ ఆదర్శాలు భారతదేశానికి ఇప్పుడు తక్షణ అవసరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి(అమరవీరుల దినోత్సవం) సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయన్ను స్మరించుకున్నారు. జాతి సమగ్రత, ఐక్యతను నిలబెట్టేందుకు తన జీవితాన్ని అర్పించిన మహాత్ముడు ఈ దేశ పురోగమనానికి సదా ఓ దిక్సూచిలా నిలుస్తారని సీఎం పేర్కొన్నారు. నమ్మిన లక్ష్యానికి చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను లెక్క చేయకుండా ఒక్కొక్కటిగా అధిగమిస్తూ విజయతీరాలకు చేరాలనే స్ఫూర్తిని గాంధీ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని