హింసించి ప్రాణాలు తీసే సింహాన్ని తరిమికొట్టడం ఖాయం

ప్రజల్ని హింసించి ప్రాణాలు తీసే సింహాన్ని భవిష్యత్తులో రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి తెదేపా నేతలు ధ్వజమెత్తారు.

Published : 31 Jan 2023 05:05 IST

సీఎం జగన్‌ వ్యాఖ్యలపై తెదేపా నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ప్రజల్ని హింసించి ప్రాణాలు తీసే సింహాన్ని భవిష్యత్తులో రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి తెదేపా నేతలు ధ్వజమెత్తారు. ‘జగనన్న చేదోడు’ ఆర్థిక సాయం విడుదల సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండ సభలో తెదేపా అధినేత చంద్రబాబుపై జగన్‌ చేసిన విమర్శలు, తాను సింహంలా సింగిల్‌గానే నడుస్తున్నానన్న వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. 70 ఏళ్లు దాటినా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే చంద్రబాబు ముసలాయనా? జనాన్ని చూసి భయపడే మీరు(జగన్‌) ముసలాయనో చెప్పాలని ప్రశ్నించారు. గాలిని చూసి కూడా భయపడుతున్నారు కాబట్టే చెట్లను నరికిస్తున్నారని ..అంత ధైర్యవంతులైతే చీకటి జీవో ఎలా తెచ్చారని నిలదీశారు. ‘‘తల్లినీ, చెల్లినీ ఇంట్లో నుంచి గెంటేసి, నేను సింహాన్ని, సింగిల్‌గా ఉంటానని జగన్‌ చెప్పుకోవడం హాస్యాస్పదం. భవిష్యత్తులో ప్రజలు జగన్‌ను ఒంటరి చేయడం ఖాయం’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

రూ.పది వేలిస్తూ..పన్నుల పేరుతో రెట్టింపు వసూలు  

‘జగనన్న చేదోడు’ పేరుతో దర్జీలు, నాయీబ్రాహ్మణులు, రజకులకు రూ.పది వేలిస్తూ..పన్నులు, విద్యుత్తు బిల్లులు పెంచి రెట్టింపు వసూలు చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను కుదించి వారికి రాజ్యాధికారాన్ని దూరం చేశారని ధ్వజమెత్తారు. ‘‘హింసించి ప్రాణాలు తీసే సింగిల్‌ సింహాన్ని జనారణ్యం నుంచి తరిమికొట్టడానికి ప్రజలే సిద్ధమవుతున్నారు. జగన్‌ పని అయిపోయింది’’ అని మాజీ మంత్రి అమర్‌నాథరెడ్డి పేర్కొన్నారు. ‘‘సొంత కుటుంబ సభ్యుల్నే వేధించి పంపేసినాక అమాయకజీవుల్ని తినేసిన సింగిల్‌ సింహంలా కాక గంగిగోవులా ఎలా ఉంటావు జగన్‌రెడ్డి?’’ అని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ మండిపడ్డారు. ‘‘సింగిల్‌ సింహం వస్తే పచ్చని చెట్లు మోడులైపోతాయి. పరిసరాలన్నీ పరదాలు చుట్టుకుంటాయి. దుకాణాలన్నీ మూతపడతాయి’’ అని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఎద్దేవాచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని