కర్ణాటకలో పక్కాగా.. ఏపీలో పట్టనట్లుగా

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర భద్రత, బందోబస్తు విధుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మొక్కుబడిగా వ్యవహరిస్తుంటే.. కర్ణాటక పోలీసులు బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో చేసి చూపించారు.

Published : 31 Jan 2023 05:05 IST

లోకేశ్‌ పాదయాత్రకు పోలీసుల భద్రత తీరిదీ..

ఈనాడు, అమరావతి: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర భద్రత, బందోబస్తు విధుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మొక్కుబడిగా వ్యవహరిస్తుంటే.. కర్ణాటక పోలీసులు బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో చేసి చూపించారు. ఈ నెల 27న కుప్పంలో ప్రారంభమైన లోకేశ్‌ పాదయాత్ర ఆది, సోమవారాల్లో సరిహద్దుల్లోని కర్ణాటక రాష్ట్రం మీదుగా ఆరు కిలోమీటర్ల మేర సాగింది. కర్ణాటక మీదుగా యాత్ర సాగుతుందన్న సమాచారాన్ని నిర్వాహకులు అక్కడి పోలీసులకు ఇవ్వకపోయినా పాదయాత్ర కర్ణాటకలోకి వచ్చేసరికి సరిహద్దు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు సిద్ధంగా ఉన్నారు. పర్యవేక్షణకు వచ్చిన డీఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు లోకేశ్‌కు పరిచయం చేసుకుని విధుల్లో చేరిపోయారు. డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్‌లు లోకేశ్‌కు కొద్ది దూరంలో వలయంలా ఏర్పడి, ఆయనతో పాటు నడిచారు. జనం ఒక్కసారిగా దూసుకురాకుండా కొందరు పోలీసులు రోప్‌ పార్టీగా ఏర్పడితే.. మరికొందరు వాహనాల రాకపోకల్ని క్రమబద్ధీకరించారు. కొన్నిచోట్ల వాహనాల్ని ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. తమ రాష్ట్ర పరిధిలో యాత్ర ముగిసిన తర్వాత లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, వీడ్కోలు పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగారు. మొత్తం 70-80 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.  

పేరుకే భద్రత.. నిఘాపైనే దృష్టి

మరోవైపు యాత్రకు భద్రత, బందోబస్తు విధుల నిర్వహణలో ఏపీ పోలీసుల తీరు విమర్శల పాలవుతోంది. చివరి నిమిషం వరకూ యాత్రకు అనుమతులివ్వకుండా తాత్సారం చేశారు. తర్వాత అనుమతులిచ్చినా యాత్రలో పాల్గొనేవారి భద్రత, జనసమూహ నియంత్రణ వంటివి నిర్వాహకులే చూసుకోవాలని తేల్చి చెప్పేశారు. తొలిరోజు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహించారు. దానిపై విమర్శలు రావడంతో రెండో రోజు నుంచి సిబ్బందిని మోహరిస్తున్నా వారు మొక్కుబడిగా, యాత్రకు దూరదూరంగా నడుస్తున్నారు. నాయకుల భద్రత, జనసమూహాన్ని నియంత్రించటం, రద్దీ ఏర్పడకుండా చూడటం వంటివి తెదేపా వాలంటీర్లు, ప్రైవేటు భద్రతా సిబ్బంది, అభిమానులే చూసుకుంటున్నారు. పోలీసులు మాత్రం కెమెరాల్లో యాత్రను చిత్రీకరించే పనిలోనే తలమునకలై ఉంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. లోకేశ్‌కు భద్రతగా నడుస్తున్నట్లు తెలిస్తే ప్రభుత్వం ఏమంటుందోననే భయంతో దూరదూరంగా ఉంటున్నామని విధుల్లో ఉన్న కొందరు పోలీసులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు