నన్ను భౌతికంగా అంతమొందించే కుట్ర

‘నన్ను భౌతికంగా అంతమొందించే కుట్ర ఇది. నక్సల్‌ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేనైనా నా భద్రతను కుదించేశారు.

Published : 01 Feb 2023 04:00 IST

నా ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారు
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ‘నన్ను భౌతికంగా అంతమొందించే కుట్ర ఇది. నక్సల్‌ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేనైనా నా భద్రతను కుదించేశారు. హైదరాబాద్‌ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు వస్తుంటే నీడలా వెంటాడారు. నా ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారు. మా ప్రభుత్వమే నా ఫోన్‌ను ట్యాప్‌ చేయాలని ఆదేశించడమేంటి?’ అని వైకాపా ఎమ్మెల్యే, మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వెంకటగిరి పరిధిలో 5 మండలాలను కేంద్రం నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది. మరోవైపు ఎర్రచందనం స్మగ్లర్ల ప్రభావం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు భద్రతను తగ్గించడంలో అర్థమేంటి? నాకు మిగిల్చిన ఇద్దరినీ తీసేయండని చెప్పా. భద్రత తొలగింపుపై ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలి’ అని నిలదీశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సాధారణంగా ఒక ప్రభుత్వం వరుసగా రెండు సార్లు వస్తే ఆ ప్రభుత్వంపై భిన్నాభిప్రాయాలు వస్తాయి. కానీ ఈ ప్రభుత్వంపై నాలుగేళ్లలోపే అలా రావడం బాధాకరం. తెదేపా పాలనను.. వైకాపా పాలనను ప్రజలు బేరీజు వేస్తున్నారు. పార్టీవల్లే మేం శాసనసభ్యులమయ్యాం. కానీ ఆత్మవంచన చేసుకుని పార్టీలో ఉండాలంటే కష్టం. ఇప్పటికైతే నేనున్న పార్టీలో రాజ్యాంగపరంగా వచ్చిన పదవిలో కొనసాగుతున్నా. నిర్ణయం మార్చుకునే రోజు వచ్చినపుడు ఒక్క క్షణం కూడా ఆలోచించను’ అని ఆనం స్పష్టం చేశారు. ‘వెంకటగిరిలో శాసనసభ్యుడినైన నన్ను నిలువరించే ప్రయత్నం ప్రారంభమైంది. రాజ్యాంగేతర శక్తులు వచ్చి అధికారులు, కమిషనర్లను, ఎమ్మార్వోలు, ఎంపీడీఓలను తీసేస్తామని... రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేకున్న భద్రతను తగ్గించేస్తామని అంటుంటే.. ఏ రకమైన పరిపాలనా దక్షతను ప్రదర్శించగలరు? మండల సర్వసభ్య సమావేశాలకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన శాసనసభ్యుడిని ఆహ్వానించాలే తప్ప, రాజ్యాంగేతర శక్తులను కాదు. నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటివి చూడలేదు. వెంకటగిరిలో రాజకీయ అనిశ్చితి వచ్చింది’ అని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు