సింహపురిలో వైకాపా కంచుకోటకు బీటలు!

అధికార వైకాపాకు కంచుకోటలాంటిది సింహపురి. ఇప్పుడా కంచుకోట బద్ధలవుతోంది. పార్టీకి రాజకీయ పునాదిపడ్డ ప్రాంతమది.. జగన్‌, ఆయన తల్లి విజయమ్మ తర్వాత వైకాపా నుంచి ఒక ఎంపీ, ఎమ్మెల్యే గెలిచింది శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే.

Published : 04 Feb 2023 03:10 IST

ఈనాడు, అమరావతి: అధికార వైకాపాకు కంచుకోటలాంటిది సింహపురి. ఇప్పుడా కంచుకోట బద్ధలవుతోంది. పార్టీకి రాజకీయ పునాదిపడ్డ ప్రాంతమది.. జగన్‌, ఆయన తల్లి విజయమ్మ తర్వాత వైకాపా నుంచి ఒక ఎంపీ, ఎమ్మెల్యే గెలిచింది శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే. 2014లో ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు దక్కాయి. 2019లో అయితే జిల్లా మొత్తం స్వీప్‌ చేసింది. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అవుతున్నట్లుగా ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇప్పటికే బహిరంగంగా యుద్ధం ప్రకటించారు. మరో ఎమ్మెల్యే పార్టీ నిర్ణయాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. మిగిలినవారి మధ్య సమన్వయమూ అంతంతే. నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలతో నెల్లూరు జిల్లా వైకాపా రివర్స్‌ గేర్‌లో పయనిస్తోంది. అధికార పార్టీలో మొదలైన ఈ ముసలం ఎన్నికలనాటికి ఏ స్థాయికి చేరుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

అనుమానమా.. అవమానమా..

‘నా ఫోన్‌ ట్యాప్‌ చేసి, నన్ను అనుమానించి అవమానించారు’ అంటూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ‘రాజ్యాంగేతర శక్తులతో వెంకటగిరిలో పాలన చేయిస్తున్నారు.. నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు, నా కూతురు, మనవరాళ్లతోనూ ఫోన్‌లో మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది. నన్ను భౌతికంగా అంతమొందించే కుట్రలో భాగంగానే నాకున్న భద్రతనూ తగ్గించారు’ అని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైకాపా అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ పరిణామాలతో కంగుతిన్న అధినాయకత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా వెంకటగిరికి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సమన్వయకర్తలుగా నియమించింది. కానీ, ఇక్కడ పార్టీని కాపాడుకోగలమన్న ధీమా మాత్రం కనిపించడం లేదని అంటున్నారు.

మేకపాటి, నల్లపురెడ్డిల సంగతిలా..

వైకాపా ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్‌లో ఎంపీ పదవికి రాజీనామా చేసి మరీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి బయటికొచ్చారు. వైకాపా కడప ఎంపీగా జగన్‌, పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మ గెలిచిన తర్వాత, ఆ పార్టీ తరపున నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గెలిచారు. అయితే మేకపాటికి 2019లో టికెట్‌ దక్కలేదు. కనీసం తితిదే ఛైర్మన్‌గా అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నా వైకాపా అధిష్ఠానం నుంచి స్పందన రావడం లేదన్న చర్చ నెల్లూరులో ఉంది. ఆయన కుమారుడు మేకపాటి గౌతంరెడ్డి మంత్రిగా ఉంటూ మృతి చెందారు. ఆ సీటును గౌతమ్‌ సోదరుడు విక్రమ్‌రెడ్డికి ఇచ్చారు. కానీ, మేకపాటి కుటుంబానికి జిల్లాలో గతంలో ఉన్న ప్రాబల్యం ఇప్పుడు లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు రాజమోహన్‌రెడ్డి సోదరుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయగిరిలోనూ వైకాపాలో ముసలం మొదలైంది. నియోజకవర్గ పరిశీలకుడిగా ధనుంజయరెడ్డిని అధిష్ఠానం నియమించింది. ‘ఆయన నియోజకవర్గంలో నాకు వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహిస్తూ.. నాపైనా పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఇలా మేకపాటి కుటుంబానికి ఇబ్బందులు తప్పని పరిస్థితి. మరోవైపు జిల్లాలో వైకాపా తొలి ఎమ్మెల్యే అయిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి 2019లో పార్టీ అధికారంలోకొచ్చాక మొదటి, రెండో మంత్రివర్గంలోనూ అవకాశం దక్కలేదు.

నగరంలో నానాటికీ.. తీసికట్టుగా..

నెల్లూరు నగరంలో ఇప్పుడు పార్టీ పరిస్థితేమిటనేదీ చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను విభేదిస్తూ ఆయన బాబాయ్‌, నగర డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, నుడా ఛైర్మన్‌, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌ గ్రూపులను నిర్వహిస్తున్న పరిస్థితి. రూప్‌కుమార్‌, ద్వారకానాథ్‌ ఇద్దరూ కలిసి అనిల్‌కు వ్యతిరేకంగా కార్యక్రమాలూ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి వ్యయప్రయాసలకోర్చిన ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన కొందరు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక గుర్తింపు లేక అవమానభారంతో దూరంగా జరిగారని అంటున్నారు.

సీన్‌ రివర్స్‌ అవుతుందా?

2019 ఎన్నికల సమయంలో తెదేపా టికెట్‌ పొంది చివరి నిమిషంలో వైకాపా తరపున బరిలో దిగి గెలిచిన పరిస్థితి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిలాంటి వారిది. ఈసారి ఎన్నికల్లో ఇలాంటివి రివర్స్‌ అవుతాయేమో అనేంతగా పార్టీ పరిస్థితి దిగజారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని